ఉపవాసం చేసేవారు సహజంగానే దైవం కోసం దాన్ని పాటిస్తుంటారు. కానీ ఉపవాసం చేయడం వల్ల ఆరోగ్యపరంగా కూడా లాభాలు కలుగుతాయి. వారంలో ఒక రోజు ఉపవాసం ఉండడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. వారంలో ఒక రోజు ఉపవాసం అంటే.. ఆ రోజు మొత్తం ఏమీ తినరాదు. కనీసం పళ్ల రసాలు కూడా తాగరాదు. కేవలం మంచినీటిని తాగాలి. ఆకలిగా ఉంటే గోరు వెచ్చని నీటిని ఒక గ్లాస్ మోతాదులో తీసుకుని అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. ఆకలి అయినప్పుడల్లా ఇలా చేయాలి. ఇలా వారంలో ఒక రోజు ఉపవాసం చేయాల్సి ఉంటుంది. దీంతో రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు.
2. వారంలో ఒక రోజు ఉపవాసం ఉండడం వల్ల అధిక బరువును తగ్గించుకోవడం తేలికవుతుంది. శరీరంలో కరిగిపోకుండా మొండిగా ఉండే కొవ్వు సైతం కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
3. ఉపవాసం చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పనితీరు మెరుగు పడుతుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది.
4. హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారు వారంలో ఒక రోజు ఉపవాసం చేయడం వల్ల హార్మోన్లు సమతుల్యం అవుతాయి. జీవక్రియలు సరిగ్గా నిర్వర్తించబడతాయి. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
5. డయాబెటిస్ సమస్య ఉన్నవారు వైద్యుల సూచన మేరకు వారంలో ఒక రోజు ఉపవాసం చేయవచ్చు. దీంతో ఇన్సులిన్ సెన్సిటీవిటీ పెరుగుతుంది. శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా గ్రహిస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
6. వారంలో ఒక రోజు ఉపవాసం చేయడం వల్ల శరీరంలో బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ (బీడీఎన్ఎఫ్) పెరుగుతుంది. ఇదొక ప్రోటీన్. దీని వల్ల న్యూరాన్లు ఉత్పత్తి అవుతాయి. మెదడు చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటుంది. యాక్టివ్‌గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.
7. వారంలో కనీసం ఒక రోజు ఉపవాసం ఉన్నా చాలు ఆయుష్షు పెరుగుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది.
8. వారంలో ఒక రోజు ఉపవాసం ఉంటే జీర్ణవ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. శరీరంలోని వాపులు కూడా తగ్గుతాయి.