పోషణ విషయానికి వస్తే మిల్లెట్స్ ఎల్లప్పుడూ పైచేయి సాధిస్తాయి. దక్షిణ భారత రాష్ట్రాల్లో విస్తృతంగా ఉపయోగించే ఆరోగ్యకరమైన మైనర్ మిల్లెట్లలో ఫాక్స్‌టైల్ మిల్లెట్స్ ఒకటి. వీటినే కొర్రలు అని పిలుస్తారు. కొందరు అండుకొర్రలు అంటారు. ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో పాశ్చాత్య దేశాలలోనూ మిల్లెట్లను తినడాన్ని ఇష్టపడుతున్నారు. వీటిని సూపర్ ఫుడ్‌గా చెబుతారు. అనేక రకాల వ్యాధులను తగ్గించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ మిల్లెట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.
* కొర్రలను తినడం వల్ల నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యం మెరుగు పడుతుంది. ప్రస్తుతం చిన్నారుల నుంచి పెద్దల వరకు అనేక మందికి నాడీ సంబంధ వ్యాధులు వస్తున్నాయి. అవి రాకుండా ఉండాలంటే రోజూ కొర్రలను తినాలి.
* అల్జీమర్స్ ఉన్నవారు కొర్రలను తినడం వల్ల ఫలితం ఉంటుంది. కొర్రలలో అనేక రకాల బి విటమిన్లు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. మెదడును యాక్టివ్‌గా ఉంచుతాయి. మెదడు అభివృద్ధికి సహాయ పడతాయి. మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతాయి. దీంతో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి.
* కొర్రలలో ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటుంటే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. కండరాలకు ఆక్సిజన్ సరిగ్గా అందుతుంది. కొర్రల్లో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. వీటిలోని కాల్షియం ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
* కొర్రల్లో ఉండే విటమిన్ బి1 గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. గుండె జబ్బులు ఉన్నవారు కొర్రలను తింటుంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
* డయాబెటిస్ ఉన్నవారికి కొర్రలు చక్కని ఆహారం. వీటిని దోశ, ఇడ్లీ, ఉప్మా, అన్నంలా వండుకుని తినవచ్చు. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
* కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు రోజూ కొర్రలను తింటుంటే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.
* మలబద్దకం సమస్య ఉన్నవారు రోజూ కొర్రలను తింటుంటే ఫలితం ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అధిక బరువును తగ్గించుకోవచ్చు.
* కొర్రలను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు.