మనకు తినేందుకు రకరకాల రొట్టెలు అందుబాటులో ఉన్నాయి. గోధుమ పిండి, జొన్న పిండి, రాగులు.. ఇలా భిన్నరకాల ధాన్యాలతో తయారు చేసిన పిండిలతో రొట్టెలను తయారు చేస్తారు. అందులో భాగంగానే ఎవరైనా సరే తమకు ఇష్టమైన రొట్టెలను తింటుంటారు. ఇక బ్రెడ్‌ను రీఫైన్ చేయబడిన పిండి, చక్కెర వంటివి కలిపి తయారు చేస్తారు.
అయితే రొట్టె, బ్రెడ్.. రెండింటిలో ఏది మంచిది ? దేని వల్ల ప్రయోజనాలు కలుగుతాయి ? అంటే.. నిస్సందేహంగా రొట్టె మంచిదని చెప్పవచ్చు. ఎందుకంటే..
నూనె వేయకుండా కాల్చిన ఒక గోధుమ రొట్టెలో 22 గ్రాముల పిండి పదార్థాలు, 0.5 గ్రాముల కొవ్వు ఉంటాయి. ఆ రొట్టె ద్వారా 106 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఇక రొట్టెలో ఫైబర్, మెగ్నిషియం, పొటాషియం, కాల్షియం, ప్రోటీన్లు ఉంటాయి.
అదే రెండు బ్రెడ్ ముక్కలలో 120 క్యాలరీల శక్తి, 24 గ్రాముల పిండి పదార్థాలు, 2 గ్రాముల కొవ్వు ఉంటాయి. రొట్టెల్లో చక్కెర ఉండదు. కానీ రెండు బ్రెడ్ ముక్కలను తింటే 6 గ్రాముల షుగర్ తిన్నట్లే. అందువల్ల ఎలా చూసినా సరే బ్రెడ్ కన్నా రొట్టెలే ఆరోగ్యకరమైనవి. పొట్టుతో సహా పిండి పట్టి దాంతో రొట్టెలను తయారు చేసుకుని తింటే ఇంకా మంచిది. దాంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.