Pesticides Residues: ప్రస్తుతం మనకు సేంద్రీయ పద్ధతిలో పండించిన పండ్లు, కూరగాయలు లభిస్తున్నాయి. అయినప్పటికీ కృత్రిమ ఎరువులు వేసి పండించినవే ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయి. ఈ క్రమంలో వాటిని తింటున్న మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాం. క్రిమి సంహారక మందులను వాడి పండించిన పండ్లు, కూరగాయలను తినడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి.
కృత్రిమ ఎరువులను వాడి పండించిన వాటిని తినడం వల్ల శిశువుల్లో పుట్టుక లోపాలు వస్తున్నాయి. అలాగే క్యాన్సర్లు, జన్యు సంబంధ లోపాలు, రక్తానికి చెందిన అనారోగ్య సమస్యలు, నాడీ మండల వ్యవస్థకు చెందిన వ్యాధులు వస్తున్నాయి. కనుక సేంద్రీయ పద్ధతిలో సాగు చేసిన పండ్లను, కూరగాయలను తినాలని నిపుణులు చెబుతున్నారు.
అయితే మనం తినే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు కృత్రిమ ఎరువులు వేసి పండించినవే కనుక వాటిలోని క్రిమి సంహారక మందుల అవశేషాలు తొలగించుకుని తినాలి. దీంతో కొంత వరకు ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.
* మనం తినే పండ్లు, కూరగాయలను కొన్న వెంటనే ఇంటికి తెచ్చాక నల్లా నీటి కింద ఉంచి కడగాలి. దీంతో 60 నుంచి 70 శాతం వరకు క్రిమి సంహారక మందుల అవశేషాలు పోతాయి. నల్లా నీటి కింద ఉంచి కనీసం 5 – 10 నిమిషాలు కడగాలి.
* కూరగాయలను బాగా ఉడికిస్తే వాటిల్లో ఉండే క్రిమి సంహారక మందుల అవశేషాలు పోతాయి. అందువల్ల కూరగాయలను పచ్చిగా తినరాదు. బాగా ఉడికించి తినాలి.
* కూరగాయలు లేదా పండ్లను పొట్టు తీసి తినవచ్చు. కానీ పొట్టు తీసి తింటే కొన్ని పోషకాలను కోల్పోవాల్సి వస్తుంది. కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది.
* ఒక పెద్ద టబ్‌లో నీటిని తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేయాలి. ఆ నీటిని బాగా కలిపి అందులో పండ్లు, కూరగాయలను వేసి కొంత సేపు ఉంచాలి. 10-15 నిమిషాలు ఉంచితే కూరగాయలపై ఉండే బాక్టీరియా, ఇతర సూక్ష్మ జీవులు నశిస్తాయి. క్రిమి సంహారక మందుల అవశేషాలు పోతాయి. ఇలా వాటిని శుభ్రం చేసి తినవచ్చు.
* 10 శాతం వెనిగర్, 90 శాతం నీటి మిశ్రమంలో కూరగాయలు, పండ్లను కొంతసేపు నానబెట్టాఇ. తరువాత కడిగేయాలి. ఇలా కూడా అవశేషాలు తొలగిపోతాయి.
* కూరగాయలు, పండ్లను వేడి నీటిలో కూడా నానబెట్టవచ్చు. దీంతో క్రిమి సంహారక మందుల అవశేషాలను తొలగించవచ్చు.