ఆరోగ్యం

శరీరానికి ఎంతో మేలు చేసే గోధుమలు.. అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టి, బలాన్నిస్తాయి..!

గోధుమలతో తయారు చేసిన పిండితో చాలా మంది భిన్న రకాల వంటలు చేసుకుంటారు. గోధుమ రవ్వను ఉపయోగించి కూడా వంటలు చేస్తుంటారు. అయితే గోధుమలను నేరుగా ఉపయోగించడం వల్ల మనకు ప్రయోజనాలు కలుగుతాయి. వాటితో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

home remedies and health benefits using wheat

1. గోధుమలను ఒక రోజంతా నీటిలో నానబెట్టాలి. తరువాత ఒక శుభ్రమైన గుడ్డలో గట్టిగా మూట కట్టి గిన్నెలో ఉంచి మూత పెట్టి 24 గంటల పాటు ఉంచాలి. దీంతో మొలకలు వస్తాయి. వాటిని ఆరబెట్టి మట్టి పాత్ర లేదా ఇనుప పాత్రలో గోధుమలు గట్టి పడే వరకు వేయించాలి. దీంతో మొలకలు నల్లగా మాడిపోతాయి. తరువాత మాడిన మొలకలను జల్లించి తీసివేసి మెత్తని పిండిగా విసిరి నిల్వ చేసుకోవాలి. దాన్ని 1-2 టీస్పూన్లు తీసుకుని గ్లాస్‌ నీళ్లకు కలిపి జావకాచి కావల్సినంత చక్కెర, నెయ్యి కలిపి 8 నెలలు నిండిన పిల్లలకు రోజుకు ఒకసారి తినిపించాలి. ఇది వృద్ధులకు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటున్న వారికి చక్కని ఆహారంగా పనిచేస్తుంది.

2. గోధుమ పిండితో మందంగా బ్రెడ్‌ మాదిరిగా చేసి ఒక పక్క వేడి చేయాలి. రెండో పక్క ఆవ నూనెను రాసి పసుపు చల్లాలి. ఈ భాగాన్ని చీము గడ్డకు తగిలేట్లు అమర్చి కట్టు కట్టాలి. రాత్రంతా ఇలాగే ఉంచితే మరుసటి రోజు ఉదయం గడ్డ పగిలి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

3. గోధుమలను ఇనుప లేదా మట్టి పాత్రలో దోరగా వేయించి పిండి చేసి పటిక బెల్లం పొడిని గానీ, బెల్లం గానీ కలిపి తినాలి. బలం వస్తుంది. నీరసం పోతుంది.

4. గోధుమలను రవ్వగా మరలో ఆడించి నిల్వ చేసుకోవాలి. దీన్ని అర కప్పు తీసుకుని 4 కప్పుల నీళ్లు పోసి జావ మాదిరిగా ఉడికించి ఉప్పు, చక్కెరను కలిపి తాగాలి. జ్వరం వచ్చిన వారు ఇలా తాగితే నీరసం తగ్గుతుంది.

5. గోధుమ పిండిని జల్లించకుండా పొట్టుతో సహా తీసుకుని నీటితో తడిపి 4 గంటల పాటు ఉంచి రొట్టె తయారు చేసి రాత్రి పూట తింటుండాలి. మలబద్దకం తగ్గుతుంది.

6. గోధుమ పిండిని నెయ్యితో వేయించాలి. తరువాత కొంచెం నీళ్లు పోసి తగినంత చక్కెర కలిపి హల్వా మాదిరిగా తయారు చేసుకోవాలి. దీన్ని పిల్లలకు తినిపించి ఒక గ్లాసు పాలను తాగించాలి. దీంతో పిల్లలు బలంగా ఎదుగుతారు. వారి ఎముకలు దృఢంగా మారుతాయి.

7. గోధుమ పిండిని దోరగా వేయించి ఒక టీస్పూన్‌ మోతాదులో తీసుకుని అంతే మోతాదులో చక్కెర కలిపి తింటుండాలి. కడుపులో, ఛాతిలో ఏర్పడే మంట తగ్గుతుంది.

8. గోధుమలను నూక లాగా మరలో ఆడించుకోవాలి. దాన్ని అన్నం లాగా వండుకుని తింటుండాలి. శరీరం పుష్టిగా తయారవుతుంది.

Admin

Recent Posts