చలికాలంలో సహజంగానే అందరూ వేడి నీటితో స్నానం చేస్తుంటారు. దీని వల్ల శరీరానికి ఎంతో సుఖంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అయితే ఇలా స్నానానికి వేడి నీటిని ఉపయోగించడం వల్ల లాభాలు ఉన్నప్పటికీ దీంతోపాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గుండె జబ్బులతో బాధపడుతున్నవారు స్నానం చేసే నీటి ఉష్ణోగ్రతను సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల కండరాలపై పడే ఒత్తిడి తగ్గుతుంది. శారీరకంగా ఎంతో రిలీఫ్ లభిస్తుంది. అలాగే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్, పోషకాలు సరిగ్గా సరఫరా అవుతాయి.
వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. దీంతో చర్మంపై ఉండే దుమ్ము, ధూళి పోతుంది. చర్మం శుభ్రంగా మారుతుంది. వేడి నీటితో స్నానం చేయడం వల్ల మొత్తం శరీరానికి ఎంతో హాయి లభిస్తుంది. శరీరంలో ఎక్కడైనా పట్టేసినట్లు ఉన్నా, నొప్పులు ఉన్నా తగ్గుతాయి. అయితే వేడి నీటితో స్నానం చేయడం వల్ల లాభాలే కాదు, నష్టాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా వేడి నీటి స్నానం వల్ల చర్మం పొడిగా మారుతుంది. దీంతో చర్మం పగలడం మొదలవుతుంది. కనుక చలికాలంలో వేడి నీటి స్నానం చేసేవారు చర్మం పగలకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే స్నానం చేసిన వెంటనే చర్మం పగిలి దురద, ఇర్రిటేషన్ వస్తాయి. ఇక వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో బీపీ కూడా కాస్త పెరుగుతుంది.
కనుక బీపీ లేదా గుండె సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారు నీటి ఉష్ణోగ్రత మరీ ఎక్కువగా లేకుండా జాగ్రత్త పడాలి. లేదంటే స్నానం చేసిన అనంతరం కొందరికి తల తిరిగినట్లు అనిపిస్తుంది. దీంతోపాటు నీరసంగా, అలసిపోయినట్లు అవుతుంది. ఇక వేడి నీటితో స్నానం చేసిన అనంతరం చర్మం పగలకుండా ఉండేందుకు గాను మాయిశ్చరైజర్‌ను వాడాల్సి ఉంటుంది. లేదంటే చర్మం బాగా పగులుతుంది. దీంతో చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక వేడి నీటి స్నానం చేసే వారు ఈ జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది.