కర కర లాడే గుండ్రని ఆలు చిప్స్… నిలువుగా తరిగి నూనెలో ఫ్రై చేసి కారం చల్లిన ఘుమ ఘుమ లాడే ఫింగర్ చిప్స్ లేదా ఫ్రెంచ్ ఫ్రైస్… ఆలుగడ్డ ఫ్రై కూరలు… వీటి పేర్లు చెబుతుంటేనే మనకు నోట్లో నీళ్లు ఊరుతుంటాయి కదూ. అయితే జాగ్రత్త. ఎందుకంటే వీటిని తినడం వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్, హార్ట్ ఎటాక్స్ వచ్చే అవకాశం రెండింతలు ఎక్కువగా ఉంటుందట. ఇది మేం చెబుతోంది కాదు, పలువురు అమెరికన్ సైంటిస్టులు 8 ఏళ్ల పాటు చేసిన స్టడీ ఫలితమే ఇది. ఈ స్టడీని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో ప్రకటించారు. అందులో ఏముందంటే…
అమెరికాకు చెందిన ఓ సైంటిస్టు బృందం 8 ఏళ్లుగా సుమారు 4,440 మందిని, వారి ఆహారపు, వ్యక్తిగత, ఇతర అలవాట్లను పరిశీలిస్తూ వచ్చింది. వీరంతా 45 నుంచి 79 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న వారు. వీరిలో ఈ 8 ఏళ్ల కాలంలో 236 మంది చనిపోయారు. అది ఎందుకో తెలుసా..? వీరు ఫ్రై చేసిన ఆలుగడ్డ వెరైటీలను ఎక్కువగా తినేవారట. ఎంతలా అంటే వారంలో కనీసం 3, 4 సార్లయినా తినేవారట. దీంతో వారు క్యాన్సర్, గుండె జబ్బుల బారిన పడి మృతి చెందారని సదరు సైంటిస్టులు వెల్లడించారు. కనుక వారు ఏం చెబుతున్నారంటే…
ఆలుగడ్డలను ఫ్రై చేసుకుని తినకూడదని ఆ అమెరికన్ సైంటిస్టులు చెబుతున్నారు. చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, వేపుళ్లు వంటివి తినకూడదని వారు అంటున్నారు. నిజంగా అసలు ఆలుగడ్డను వేయించినప్పుడు ఏం జరుగుతుందంటే… వాటిలో అక్రయిలమైడ్ అనబడే ప్రమాదకరమైన విష పదార్థాలు తయారవుతాయట. వీటిని కార్సినోజెన్లు అని పిలుస్తారు. వీటి వల్ల అడ్రినల్, థైరాయిడ్ గ్రంథులు, ఊపిరితిత్తుల్లో ట్యూమర్లు (కణతులు) వస్తాయట. దీంతో అవి క్యాన్సర్ కణతులుగా మారుతాయని వారు చెబుతున్నారు. అంతే కాకుండా ఈ ఫుడ్స్‌ను ఎక్కువగా తినే వారికి హార్ట్ ఎటాక్స్ వచ్చే రిస్క్ చాలా వరకు పెరుగుతుందని అంటున్నారు. ఎందుకంటే ఈ ఆహారం వల్ల రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ స్థాయిలు బాగా పెరుగుతాయట. దీంతో అవి హార్ట్ ఎటాక్స్‌కు కారణమవుతాయి. కనుక… మీరు కూడా ఆలుగడ్డను అలా వివిధ రకాలుగా వేయించుకుని తింటుంటే జాగ్రత్త. లేదంటే ప్రమాదకరమైన అనారోగ్యాల బారిన పడతారు. అయితే ఆలుగడ్డను వేయించకుండా ఉడకబెట్టి తింటే ఏ ముప్పూ ఉండదని వారు అంటున్నారు.