కొంచెం లావెక్కితే చాలు. ఇక బరువు తగ్గాలని శరీరాన్ని మంచి షేప్ లో వుంచాలని తాపత్రయపడటం సహజమే. అందుకోసం నడక, వ్యాయామం, ఆహార నియంత్రణలు కూడా చేస్తారు. కాని కొంతమంది ఎన్ని చర్యలు చేపట్టినా బరువు తగ్గటంలేదని ఫిర్యాదులు చేస్తుంటారు. వాటికి కారణాలు పరిశీలిస్తే…. సాధారణంగా శరీరాన్ని అధికంగా బరువు పెరగకుండా చూసుకోవాలంటే రెండే రెండు ప్రధానాంశాలు…ఒకటి ఆహార నియంత్రణ కాగా, రెండవది తిన్న ఆహారానికి తగినట్లు సరైన వ్యాయామం చేయటం. బరువు తగ్గకపోవటానికి 5 ప్రధాన కారణాలను పరిశీలిద్దాం! సరిగాలేని ఆహార ప్రణాళిక – మీ శరీర అవసరాలను బట్టి మీ ఆహారం నిర్ణయించాలి. అంతే కాని వెయిట్ మాస్ ఇండెక్స్ ను బట్టి నిర్ణయించవద్దు. మీరు చేసే పనిని బట్టి మీ ఆహారం వుండాలి.
రోజులో ఒక్క గంట జిమ్ వర్కవుట్లు చేసి మిగిలిన రోజంతా నిద్రపోతే మీ ఆహారం సాధారణమైన దానికంటే కూడా తక్కువే వుండాలి. అవసరమనుకుంటే పోషకాహార నిపుణుడిని సంప్రదించండి. అసలు బరువు ఎపుడు తగ్గుతుంది? వ్యాయామాలు మొదలు పెట్టగానే బరువు తగ్గరు. మొదట మీ శరీరంలోని నీరు ఖర్చవుతుంది, తర్వాత కొంత ఎనర్జీ, దాని తర్వాత అధికమైన కొవ్వు కరగటం మొదలవుతుంది. శరీరం ఫలితం చూపే వరకు వర్కవుట్లు, దానికి తగిన ఆహారం కొనసాగించాలి. ఎంత సమయంలో ఎంత బరువు తగ్గామనేది ప్రతి మనిషికి వివిధ రకాలుగా వుంటుంది.
ఎప్పుడూ ఒకేరకమైన వ్యాయామం చేస్తున్నారా? మార్చండి. కనీసం 15 రోజులకొకసారి లేదా నెలకొకసారి మీ వ్యాయామ ప్రణాళిక మార్చండి. అందుకుగాను మీ శిక్షకుడిని సంప్రదించండి. వ్యాయామం మార్చితే ఫలితాలు బాగా వుంటాయి కూడాను. వ్యాయామం గుండె సంబంధిత ట్రెడ్ మిల్, వాకర్, మెట్లెక్కడం, సైకిలింగ్, స్పాట్ జోగింగ్ గాను, కండలను నిర్మించే వెయట్ లిఫ్టింగ్ గాను సమపాళ్ళలో వుండటం మంచిది. అవసరాన్నిబట్టి ఏది ఎక్కువ, ఏది తక్కువ అనేది నిర్ణయించుకోండి. హార్మోన్ల సమతుల్యత – పై చిట్కాలు ఆచరించినప్పటికి బరువు తగ్గటం లేదా? అయితే, ఇక శరీరంలోని హార్మోన్ల సమతుల్యతపై చెక్ చేయండి. ధైరాయిడ్ గ్రంధి మొదలైనవి చెక్ చేయించండి. హార్మోన్లు సమతుల్యతకు వస్తే, ఇక మీరు ఎంతో సహజంగా బరువు తగ్గటం తధ్యం. సమస్య ఎక్కడుందో ఒక సారి విశ్లేషిస్తే, బరువు తగ్గే సమస్యలకు పరిష్కారం కనుగొన్నట్లే!