పచ్చని ఆకు కూరలను మీ ఆహారం నుండి ఎప్పుడూ మినహాయించరాదు. ప్రతిరోజూ వాటిని తినాల్సిందే. శుభ్రం చేయటం, తరగటం, వండటం కష్టమని వాటిని మానరాదు. శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజలవణాలు అన్నీ వీటిలో వుండి అద్భుతమైన ఆరోగ్యాన్నిస్తూ మీ జీవన శైలినే మార్చేస్తాయి. పచ్చని ఆకు కూరలలో కొవ్వు తక్కువ, తినే తిండి ఆరోగ్యమైందిగా వుండాలంటే ఆకుకూరలు తినటం శ్రేష్టం. ఆకు కూరలు తినేముందు, వాటిని బాగా శుభ్రం చేయాలి, అనవసరమైన కొమ్మలు, రెమ్మలు మొదలైన గట్టిగా వుండే భాగాలను ఏరివేయండి. ఇక మెత్తగా వుండే ఆకు భాగాలను బాగా నీటిలో కడగండి. తరిగి చట్నీలలో కలుపుకొని తినవచ్చు. లేదా కొన్ని కూరలు పచ్చివే నమలచ్చు.
నీటితో శుభ్రం చేయటం ఎలా? ఆకు కూరలు శుభ్రం చేయటానికి మంచినీరు వాడాలి లేదంటే వాటిని ఉప్పు వేసిన వేడినీటిలో శుభ్రం చేయాలి. అపుడు మాత్రమే వాటిపై వున్న క్రిములు, వాటి గుడ్లు పూర్తిగా నశిస్తాయి. మురికి, దుమ్ము మరీ అధికంగా వుంటే పొటాషియం పెర్మాంగనేట్ ద్రావణంలో శుబ్రపరచండి. తరిగే విధానం – ఆకు కూరల్లో వుండే పోషకాలను పూర్తిగా పొందాలంటే, వాటిని బాగా సన్నగా తరగాలి. వీలైతే పచ్చివిగానే తినాలి. మెంతికూర, కర్వేపాకు, తులసి, గోంగూర, కొత్తిమీర, తోటకూర, మొదలైనవి పచ్చిగానే తినవచ్చు. వాటిని సన్నగా తరిగి ఒకసారి మిక్సర్ లో వేస్తే పేస్ట్ గా తయారై తినేవారికి మంచి రుచినిస్తుంది.
ఆకు కూరలతో సూపులు, సలాడ్లు, చేసుకోవచ్చు. వండే అన్నంలో ఆకు కూరలు వేసి తినవచ్చు. చట్నీలుగా తయారు చేయవచ్చు. సూప్ చాలా మంచిది. వీటిని ఇతర కూరలలో కూడా కలిపి తినవచ్చు. ఆకు కూరలు వండేటపుడు లేదా ఉడికించేటపుడు మూత తెరచి పెట్టరాదు. ప్రెషర్ కుక్ చేసేట్లయితే, ఉడికించిన నీటిని పారబోయ వద్దు. దానికి కొద్దిపాటి, ఉప్పు, లేదా నిమ్మరసం, లేదా కొన్ని మసాలాలు వేస్తే సూప్ లా తయారవుతుంది.