నిత్యం వివిధ సందర్భాల్లో మనం ఎదుర్కొనే ఒత్తిడి, పని భారం, ఆందోళన, మానసిక సమస్యలు, దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలు… తదితర అనేక కారణాల వల్ల మనలో చాలా మంది సరిగ్గా నిద్రపోవడం లేదు. బెడ్‌పై పడుకున్న ఏ 2, 3 గంటలకో అటు దొర్లి, ఇటు దొర్లి అతి కష్టంగా నిద్రపోతున్నారు. దీంతో తెల్లవారుజామున ఆలస్యంగా నిద్ర లేస్తున్నారు. ఇలా చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే అలా ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా సరిగ్గా నిద్ర పట్టాలంటే అందుకు కింద చెప్పిన ఆహార పదార్థాలను మనం తరచూ తింటూ ఉండాలి. దీని వల్ల శరీరానికి పౌష్టికాహారం అంది అప్పుడు సరిగ్గా నిద్ర పడుతుంది. ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అరటి పండ్లలో పొటాషియం, మెగ్నిషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి కండరాలను రిలాక్స్ చేస్తాయి. మనస్సుకు ప్రశాంతతను ఇస్తాయి. కనుక అరటి పండ్లను తింటే తద్వారా ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. దీంతోపాటు చక్కని నిద్ర పడుతుంది. నిద్రపోవడానికి కనీసం గంట ముందు ఓ అరటి పండు తింటే చాలు, దాంతో నిద్రలేమి సమస్య ఇట్టే తొలగిపోతుంది.
తేనెలో ట్రిప్టోపాన్ ఉంటుంది. ఇది మన శరీరంలోని సెరటోనిన్, మెలటోనిన్ స్థాయిలను పెంచుతుంది. నిజానికి ఈ హార్మోన్లు నిద్ర హార్మోన్లు. దీంతో ఇవి శరీరంలో ప్రేరేపితమై అప్పుడు నిద్ర సరిగ్గా పడుతుంది. కనుక తేనెను మనం ఆహారంలో భాగం చేసుకుంటే తద్వారా రోజూ చక్కగా నిద్రపోవచ్చు. నిద్రపోవడానికి ముందు ఒక టీస్పూన్ తేనెను తాగినా చాలు, మంచి ఫలితం ఉంటుంది. వాల్‌నట్స్‌లోనూ తేనెలాగే ట్రిప్టోపాన్ ఉంటుంది. ఇది శరీరంలో సెరటోనిన్, మెలటోనిన్ స్థాయిలను పెంచుతుంది. తద్వారా మనకు చక్కగా నిద్ర వస్తుంది. నిత్యం వాల్‌నట్స్ ను ఏదో ఒక సమయంలో తింటున్నా లేక నిద్రపోవడానికి ముందు 3,4 వాల్ నట్స్‌ను తిన్నా నిద్ర సమస్య నుంచి బయట పడవచ్చు.
బాదం పప్పులో మెగ్నిషియం పుష్కలంగా ఉంటుంది. ఇది చక్కని నిద్రను అందిస్తుంది. నిద్రించడానికి 30 నిమిషాల ముందు 4 బాదం పప్పులను తిన్నా చాలు, చక్కని నిద్ర వస్తుంది. చెర్రీ పండ్లలో మెలటోనిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది నిద్రను ప్రోత్సహిస్తుంది. నిద్రంచడానికి ముందు కొన్ని చెర్రీ పండ్లను తిన్నా లేదంటే చెర్రీ జ్యూస్ తాగినా ఫలితం ఉంటుంది. కోడిగుడ్లలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. ఇది నిద్ర సమస్యలను పోగొడుతుంది. కోడిగుడ్లను తరచూ ఆహారంలో తీసుకుంటుంటే నిద్ర సమస్యలను అధిగమించవచ్చు. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి వంటి పదార్థాలను నిత్యం ఆహారంలో తీసుకుంటూ ఉంటే నిద్ర సరిగ్గా పడుతుంది. వాటిలో ఉండే ట్రిప్టోపాన్ నిద్రలేమి సమస్యను పోగొడుతుంది.
కార్న్ ఫ్లేక్స్‌లోనూ మన శరీరానికి అవసరమైన కీలక పోషకాలు ఉంటాయి. అవి నిద్ర సమస్యలను పోగొడతాయి. తరచూ కార్న్ ఫ్లేక్స్ తింటుంటే నిద్ర సరిగ్గా పడుతుంది. చామంతి పూల టీని తరచూ తాగుతున్నా నిద్రలేమి సమస్యను పోగొట్టుకోవచ్చు. ఇందులో ఉండే గ్లైసీన్ అనే పదార్థం నిద్రను ప్రేరేపిస్తుంది. కనుక నిద్రించడానికి ముందు ఈ టీ తాగితే ఫలితం ఉంటుంది.