గొంతు సమస్యలు ఉంటే సహజంగానే ఎవరికైనా సరే ఆహారం తినేటప్పుడు, నీరు తాగేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మింగడం కష్టతరమవుతుంటుంది. జలుబు కారణంగా గొంతులో వాపు వచ్చినప్పుడు ఇలా అవుతుంది. దీంతో ఏ పదార్థాన్ని తిన్నా ఇబ్బందిగానే ఉంటుంది. అయితే ఈ సమస్య ఉన్నవారు వేడిగా ఉండే పదార్థాలను తింటే కొంత వరకు ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈ సమస్య ఉన్నవారు తినకూడని ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
గొంతు సమస్యలు ఉన్న వారు సిట్రస్ ఫలాలను తినరాదు. నిమ్మ, నారింజ, కివీలు, పైనాపిల్ వంటి పండ్లను తినకూడదు. తింటే గొంతులో ఇర్రిటేషన్ కలుగుతుంది. దీంతో సమస్య మరింత ఎక్కువవుతుంది.గొంతు సమస్యలు ఉంటే టమాటాలను కూడా తీసుకోకూడదు. టమాటాలు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి సమస్య తీవ్రతను పెంచుతాయి. చింత పండులో ఉండే పుల్లదనం గొంతు సమస్యను మరింత పెంచుతుంది. వాపును కలిగిస్తుంది. దురద వస్తుంది. అందువల్ల దీన్ని కూడా మానేయాలి. పచ్చళ్లు, చాట్ మసాలా వంటి పదార్థాలను కూడా గొంతు సమస్యలు ఉన్నవారు తినకూడదు. గొంతు సమస్యలు ఉన్నప్పుడు శరీర రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను తినాలి. నూనె పదార్థాలు, వేపుళ్లను తింటే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అందువల్ల ఈ పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి.
సాధారణ సమయాల్లో పెరుగును తినవచ్చు. మంచిదే. కానీ గొంతు సమస్యలు ఉన్నవారు తింటే శరీరంలో శ్లేష్మం ఎక్కువవుతుంది. దీంతో సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. కనుక పెరుగును కూడా తినరాదు. బ్రెడ్, చిప్స్ వంటి పదార్థాలతోపాటు మద్యం సేవించడం మానేయాలి. అలాగే కెఫీన్ ఉండే టీ, కాఫీలను తాగరాదు. దీని వల్ల గొంతు పొడిగా మారి సమస్య ఎక్కువవుతుంది. వీటితోపాటు కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ జ్యూస్‌లను తాగడం కూడా మానేయాలి. గొంతు సమస్యలు ఉన్నప్పుడు ఈ పదార్థాలను తినడం మానేయడం వల్ల ఆయా సమస్యలు త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది.