Kidneys Health : మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే అవయవాల్లో మూత్రపిండాలు కూడా ఒకటి. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో మూత్రపిండాలు కీలకపాత్ర పోషిస్తాయి. మన శరీరంలోని రక్తాన్ని వడకట్టి దానిలో ఉండే వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. అలాగే మూత్రపిండాలు మన శరీరంలో ఇతర కీలక విధులను కూడా నిర్వర్తిస్తాయి. కనుక మనం మూత్రపిండాల ఆరోగ్యంపై తగిన శ్రద్ద చూపించాలి. మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటే మనం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. నేటి తరుణంలో మనలో చాలామంది మూత్రపిండాల వైఫల్యానికి గురి అవుతున్నారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే వీటికి కారణాలుగా చెప్పవచ్చు. అలాగే మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలను ముందుగానే గుర్తించపోవడాన్ని కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.
చాలా మందిలో మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలను ముందుగానే గుర్తించకపోవడం చేత అవి మరింత తీవ్రమయ్యి దీర్ఘకాలిక సమస్యలుగా మారుతున్నాయి. అలాగే మూత్రపిండాల వైఫల్యానికి కూడా కారణమవుతున్నాయి. కనుక ఈ సమస్యలను మనం ముందుగానే గుర్తించడం మంచిది. మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నప్పుడు మనలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది. మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నప్పుడు మనలో కనిపించే లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మూత్రపిండాలకు సంబంధించిన వివిధ సమస్యలతో బాధపడే వారిలో రక్తపోటు ఎక్కువగా ఉంటుంది. అలాగే మూత్రం తరుచూ రావడం లేదా మూత్రం ఎక్కువగా రాకపోవడం, మూత్రంలో రక్తం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే కాళ్లు ఉబ్బడం, కళ్ల చుట్టూ ఉబ్బినట్టు ఉండడం, శరీరమంతా వాపు రావడం జరుగుతుంది. వీటితో పాటు తలనొప్పి, తల తిరిగినట్టుగా ఉండడం, ఛాతిలోనొప్పి, ఆయాసం, రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే కొందరిలో నొప్పులు, కండరాలు పట్టేయడం కూడా జరుగుతుంది. ఈ విధంగా ఈ లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించడం మంచిది. దీంతో మూత్రపిండాల ఆరోగ్యం మరింత క్షీణించడకుండా ఉంటుంది.