Left Over Curries : మనం రోజూ రకరకాల కూరలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. ఒక్కోసారి ఈ కూరలు ఎక్కువగా మిగిలి పోతూ ఉంటాయి. ఇలా మిగిలిన కూరలను ఫ్రిజ్ లో ఉంచి మరుసటి రోజూ కూడా తింటూ ఉంటాము. కొందరు రెండు నుండి మూడు రోజుల పాటు కూడా ఈ మిగిలిన కూరలను తింటూ ఉంటారు. అయితే పూర్వకాలంలో మనకు ఈ సదుపాయం లేదు. కనుక ఏ పూట కూరలు ఆ పూటనే తినే వారు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కూరలు ఎక్కువ సమయం వరకు పాడవకుండా ఉండేవి. అదే వాతావరణం వేడిగా ఉన్నప్పుడు కూరలు త్వరగా పాడవుతాయి. కనుక ఎప్పటికప్పుడు తాజాగా కూరలను వండుకుని తినేవారు. అదే నేటి కాలంలో ఉరుకుల పరుగుల జీవితం కారణంగా కొందరు ఒకేసారి ఎక్కువ మొత్తంలో కూరను వండుకుని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకుని తింటున్నారు.
ఇలా కూరలను నిలవ చేసుకుని తినడం మంచిదేనా… దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా కూరలను వండి బయట ఉంచినప్పుడు గాల్లో ఉండే సూక్ష్మజీవులు మనం తయారు చేసిన కూరలపైకి చేరి నెమ్మదిగా వాటిని పాడు చేయడం మొదలు పెడతాయి. సూక్ష్మ జీవులు క్రమంగా కూరలపై వాటికి అనుగుణంగా వాతావరణాన్ని అభివృద్ది చెందేలా చేస్తాయి. దీంతో గంట గంటకు కూరలల్లో మార్పు మొదలువుతుంది. దీంతో కూరలు పాడవడం, చద్ది వాసన రావడం జరుగుతుంది. మనం తయారు చేసిన కూరలు మిగిలిపోతున్నాయి అని తెలిసిన వెంటనే వాటిని ఫ్రిజ్ లో ఉంచడం మంచిది. ఫ్రిజ్ లో ఉంచిన కూరలను తినడం వల్ల ఎటువంటి హాని కలగదు. ఫ్రిజ్ లో ఉంచడం వల్ల కూరలపై బ్యాక్టీరియా చేరినప్పటికి కూరలు పాడయ్యే ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది.
కనుక కూరలను ఫ్రిజ్ లో ఒక పూట వరకు మాత్రమే తినవచ్చు. అనగా ఉదయం ఫ్రిజ్ లో ఉంచిన కూరలను సాయంత్రం భోజనంలో తినేయాలి. చాలా మందికి ఫ్రిజ్ లో ఉంచినప్పటికి కూరలపై బ్యాక్టీరియా ఉంటుంది కదా. మరీ ఇలా బ్యాక్టీరియా చేరిన కూరలను తినడం వల్ల ఇన్పెక్షన్ లు వచ్చే అవకాశం ఉంటుంది కదా అనే సందేహం కలుగుతుంది. మనలో చాలా మందికి ఇప్పటికి సద్ది కూరలను తినే అలవాటు ఉంది. దీంతో ఈ కూరలల్లో ఉండే బ్యాక్టీరియాను తట్టుకునే శక్తి మనకు ఏర్పడుతుంది. ఇలా నిల్వ చేసిన కూరలను తినగానే వీటిలో ఉండే బ్యాక్టీరియాను మన పొట్టలో ఉండే బ్యాక్టీరియా నశింపజేస్తుంది. దీంతో నిల్వ ఉంచిన కూరలను తిన్నప్పటికి మనకు ఎటువంటి హాని కలగదు.
అదే మొదటిసారి సద్ది కూరలను తినే వారు, సద్ది కూరలను తినే అలవాటు లేనివారికి మాత్రం ఇలా నిల్వ ఉంచిన కూరలను తినగానే ఇన్పెక్షన్ లకు గురి అయ్యే అవకాశం ఉంది. ఇలా నిల్వ ఉంచిన కూరలను తినడం వల్ల ఎటువంటి హాని కలగనప్పటికి వీటిలో ఉండే పోషకాలు మాత్రం తగ్గిపోతూ ఉంటాయి. గంట గంటకు ఈ పోషకాల పరిమాణం తగ్గుతూ ఉంటుంది. ఫ్రిజ్ లో ఉంచడం వల్ల కొద్దిగా, మరలా వేడి చేయడం వల్ల కొద్దిగా ఇలా పోషకాలు పూర్తిగా తగ్గిపోతూ ఉంటాయి. కనుక కూరలను తయారు చేసిన వెంటనే కొద్దిగా తీసి పక్కకు ఉంచాలి. దీనిని గంటెతో ఎక్కువగా కదపకూడదు. కూర మిగిలిన వెంటనే దీనిని అలాగే ఫ్రిజ్ లో ఉంచాలి. ఇలా నిల్వ ఉంచిన కూరను తరువాత పూట తినేయాలి. ఈ విధంగా కూరలను ఫ్రిజ్ లో నిల్వ చేసుకుని తీసుకోవడం వల్ల ఎక్కువగా నష్టం కలగకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.