Jonna Java : మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో జొన్నలు కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో వీటి వాడకం రోజురోజుకు ఎక్కువవుతుందనే చెప్పవచ్చు. జొన్నల్లో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పూర్వకాలంలో ఎక్కువగా జొన్నలతో వండిన అన్నాన్నే తీసుకునే వారు. కేవలం అన్నమే కాకుండా జొన్న గటక, అంబలి, రొట్టె వంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటారు. జొన్న అంబలి కూడా చాలా రుచిగా ఉంటుంది. వేసవికాలంలో దీనిలో మజ్జిగ వేసుకుని తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. జొన్న అంబలిని తీసుకోవడం వల్ల మనం సులభంగా బరువు తగ్గవచ్చు. ఒక గ్లాస్ జొన్న అంబలిని తాగగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో చాలా సమయం వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. అలాగే దీనిని తాగడం వల్ల శరీరానికి కావల్సినంత శక్తి లభిస్తుంది.
తరచూ నీరసం, శరీర బలహీనతతో బాధపడే వారు ఈ అంబలిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఈ అంబలిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే దీనిలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్దకంతో బాధపడే వారు ఈ అంబలిని తాగడం వల్ల విరోచనం సులభంగా అవుతుంది. జొన్న అంబలిని తాగడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలతో పాటు ఎముకలకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే ఈ అంబలిని తాగడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. రక్తహీనత సమస్య మన దరి చేరకుండా ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ జొన్న అంబలిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం.
దీని కోసం ముందుగా ఒక గిన్నెలో ఒకటిన్నర గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. తరువాత ఇందులో రెండు టీ స్పూన్ల జొన్న పిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత దీనిని స్టవ్ మీద ఉంచి 6 నుండి 7 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత ఈ అంబలిలో నిమ్మరసం, మజ్జిగ, ఉప్పు వేసుకుని కలపాలి. దీనిని గ్లాస్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జొన్న అంబలి తయారవుతుంది. దీనిని వారానికి మూడు నుండి నాలుగు సార్లు లేదా రోజూ తీసుకోవచ్చు. ఈ విధంగా జొన్న అంబలిని తయారు చేసుకుని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.