Sprouts : మొలకెత్తిన గింజలతో ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. పెసలు, శనలు, పల్లీలు.. ఇలా అనేక రకాల గింజలు మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిని చాలా మంది మొలకెత్తించి తింటుంటారు. అయితే మొలకెత్తిన గింజలు చాలా వరకు వాసన వస్తుంటాయి. ఇక కొన్ని రకాల గింజలు అయితే మొలకలు వచ్చేందుకు చాలా ఆలస్యమవుతుంటుంది. కానీ ఈ సమస్యలు లేకుండా మొలకలను వేగంగా, సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మొలకలు వేగంగా రావాలన్నా.. వచ్చాక వాసన లేకుండా ఉండాలన్నా.. పలు సూచనలు పాటించాలి. అవేమిటంటే.. గింజలను మొలకలుగా మార్చడానికి ముందు మనకు కావల్సిన గింజలను కావల్సినంత పరిమాణంలో ఎంపిక చేసుకున్నాక వాటిని ఒక రోజు మొత్తం ఎండలో ఉంచాలి. దీంతో వాటిలో ఉండే తేమ, జిగురు పోతాయి. ఆ తరువాత వాటిని నీటిలో నానబెట్టాలి. కొత్త గింజలు అయితే 15 గంటలు, పాత గింజలు అయితే 12 గంటల పాటు వాటిని నీటిలో నానబెట్టాలి.
ఇక గింజలను నానబెట్టిన తరువాత వాటిని తీసి ఒక వస్త్రంపై పోయాలి. వాటిని మొత్తం విస్తరించి ఆరబోయాలి. తడి లేకుండా అయ్యేవరకు వాటిని ఆరబెట్టాలి. అందుకు గాను ఒక పూట పడుతుంది. ఇక తరువాత గింజలను తీసుకుని శుభ్రమైన, పొడిగా ఉన్న గుడ్డలో వేసి చుట్టి మూటలా కట్టాలి. ఇలా గింజలను మొలకలుగా తయారు చేయాలి. ఇలా మూటకట్టిన తరువాత సుమారుగా 36 గంటల్లో మొలకలు బాగా వస్తాయి. ఏ గింజలు అయినా సరే ఇలా చేస్తే వేగంగా మొలకలు వస్తాయి.
ఇక మార్కెట్‌లో మనకు Sprout Makers అనే బాక్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా మొలకలను చాలా సులభంగా తయారు చేయవచ్చు. వీటిల్లో ఒకదానిపై ఒకటి బాక్సులను అమర్చి పెడతారు. వాటిల్లో గింజలను పోయాలి. అడుగున ఉండే బాక్సులో నీటిని నింపాలి. దీంతో చాలా త్వరగా వీటిల్లో మొలకలు వస్తాయి.
ఇక ఇవే కాకుండా రంధ్రాలు ఉండే స్టీల్ బాక్సులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా కూడా మొలకలను తయారు చేసుకోవచ్చు. అయితే పైన చెప్పిన గుడ్డకు బదులుగా ఈ బాక్స్‌లను వాడవచ్చు. కానీ ఆ ముందు చెప్పిన స్టెప్స్‌ను అన్నీ దీనికి కూడా ఫాలో కావాల్సి ఉంటుంది. దీంతో మొలకలు వేగంగా వస్తాయి. అంతేకాదు మొలకలు వచ్చాక అవి వాసన రావు. ఇలా వాసన లేని, శుభ్రమైన మొలకలను వేగంగా తయారు చేసుకోవచ్చు.