Rice Bran Oil : ప్రస్తుత కాలంలో మనకు అనేక రకాల వంట నూనెలు అందబాటులో ఉన్నాయి. అందులో రైస్ బ్రాన్ ఆయిల్ ఒకటి. ఈ ఆయిల్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆయిల్‌ను బియ్యం నుండి తయారు చేస్తారు. మాంసకృత్తులు, బి కాంప్లెక్స్ విటమిన్స్, కొవ్వులు, పీచు పదార్థాలు.. వంటి ముఖ్యమైన పోషకాలన్నీ బియ్యం పై పొరలల్లో ఉంటాయి. బియ్యం లోపలి పొరల్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. బియ్యాన్ని పాలిష్ చేయడం వల్ల పోషకాలన్నీ వెళ్లిపోతాయి. మనం బియ్యాన్ని వండుకుని అన్నంగా తిన్నప్పుడు పిండి పదార్థాలు మాత్రమే మనకు లభిస్తాయి. బియ్యాన్ని పాలిష్ చేయడం వల్ల వచ్చే పదార్థాన్ని తవుడు అంటారు.
బియ్యాన్ని పాలిష్ చేయడం వల్ల వచ్చే పోషకాలన్నీ తవుడులో ఉంటాయి. ఈ తవుడు నుండి తీసిన ఆయిల్ నే రైస్ బ్రాన్ ఆయిల్ అంటారు. 5 కిలోల తవుడు నుండి సుమారుగా 1 కిలో రైస్ బ్రాన్ ఆయిల్ వస్తుంది. ఈ ఆయిల్ ను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
00 గ్రాముల రైస్ బ్రాన్ ఆయిల్ లో 800 క్యాలరీలు ఉంటాయి. విటమిన్ ఇ కూడా ఇందులో అధికంగా ఉంటుంది. 25 శాతం శాచురేటెడ్ కొవ్వులు(రక్త నాళాలలో పేరుకు పోయే కొవ్వులు), 75 శాతం పాలీ శాచురేటెడ్, అన్ శాచురేటెడ్ కొవ్వులు( శరీరానికి మేలు చేసేవి) రైస్ బ్రాన్ ఆయిల్ లో ఉంటాయి. 2-3 శాతం ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఇందులో ఉంటాయి. ఇవి చేపల్లోనూ ఉంటాయి. అయితే చేపలను తినని వారు రైస్‌బ్రాన్ ఆయిల్‌ను తీసుకుంటే మంచిది. ఒక చేపలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లకు సమానమైనవి ఒక టీస్పూన్ రైస్ బ్రాన్ ఆయిల్‌లో ఉంటాయి. కనుక ఈ ఆయిల్‌ను తీసుకుంటే చేపలను తిన్నట్లే అవుతుంది. ఇక రక్త నాళాలలో కొవ్వు పేరుకు పోకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్లు కూడా రైస్ బ్రాన్ ఆయిల్ లో ఉంటాయి. ఈ ఆయిల్ ను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
కానీ ఈ ఆయిల్ ను వంటల్లో వాడకూడదు. ఈ ఆయిల్ ను వేడి చేసినా, మరిగించినా ఇందులో ఉండే పాలీ శాచురేటెడ్, అన్ శాచురేటెడ్(శరీరానికి మేలు చేసేవి) కొవ్వులు శాచురేటెడ్ కొవ్వులుగా మారిపోతాయి. ఈ కొవ్వులు శరీరానికి హానిని కలిగిస్తాయి. కనుక రైస్ బ్రాన్ ఆయిల్ ను వేడి చేయకూడదు. నూనె అధికంగా వాడని ఆహార పదార్థాలు అయిన సలాడ్స్, మొలకెత్తిన గింజల వంటి వాటిలో మాత్రమే ఈ ఆయిల్ ను వాడాలి. ఈ ఆయిల్ ను వాడడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని, ఏ రకమైన నూనె అయినా వేడి చేయకుండా తీసుకుంటేనే అధిక ప్రయోజనాలు కలుగుతాయని.. వైద్యులు చెబుతున్నారు.