Rice And Chapati : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే చపాతీలు, అన్నంలను ఆహారంగా తింటున్నారు. చపాతీలను ఎక్కువగా ఉత్తరాది వారు తింటుంటారు. అయితే కాలక్రమేణా అన్ని ఆహారాలను అందరూ తినడం మొదలు పెట్టారు. దీంతో చపాతీలను అందరూ తింటున్నారు. అలాగే మనం తినే అన్నం కూడా ఉత్తరాదిలో లభిస్తోంది. అయితే బరువు తగ్గేందుకు చాలా మంది రాత్రి పూట కేవలం చపాతీలను మాత్రమే తింటుంటారు. ఇక కొందరు చపాతీలు, అన్నం.. రెండింటినీ కలిపి తింటుంటారు. అయితే వాస్తవానికి ఇలా రెండు భిన్న రకాల ఆహారాలను ఒకేసారి కలిపి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
అన్నంలో, చపాతీల్లో కార్బొహైడ్రేట్లు ఉంటాయి. అయితే అన్నంలో ఉండే కార్బొహైడ్రేట్లు సాధారణమైనవి. కానీ చపాతీలను తయారు చేసేందుకు వాడే గోధుమ పిండిలో సంక్లిష్ట కార్బొహైడ్రేట్లు ఉంటాయి. ఇవి జీర్ణం అయ్యేందుకు సమయం పడుతుంది. అలాగే చపాతీల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఆలస్యంగానే జీర్ణమవుతుంది. కానీ అన్నం మాత్రం అలా కాదు. త్వరగా జీర్ణమవుతుంది. ఈ క్రమంలో రెండింటికీ జీర్ణం అయ్యేందుకు వేర్వేరు సమయం పడుతుంది. కనుక రెండింటినీ కలిపి తినరాదని నిపుణులు చెబుతున్నారు.
అన్నం త్వరగా జీర్ణమవుతుంది.. చపాతీలు జీర్ణం అయ్యేందుకు ఆలస్యం అవుతుంది. అలాంటప్పుడు ఈ రెండింటినీ కలిపి తింటే జీర్ణవ్యవస్థ ఇబ్బందులకు గురవుతుంది. ఫలితంగా గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. కొందరికి విరేచనాలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కనుక చపాతీలు, అన్నం.. రెండింటినీ కలిపి తినరాదు. ఏదైనా ఒకదాన్నే తినాల్సి ఉంటుంది. అప్పుడు జీర్ణ వ్యవస్థపై ఎలాంటి ఒత్తిడి పడదు. ఆరోగ్యంగా ఉంటుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. కనుక అన్నం, చపాతీలు.. రెండింటినీ తినాల్సి వస్తే.. ఏదైనా ఒకదాన్నే తినడం ఉత్తమం.