Sabja Seeds : సబ్జా గింజలు.. ఇవి మనందరికీ తెలిసినవే. వీటిని ఆంగ్లంలో బెసిల్ సీడ్స్ అంటారు. సబ్జా గింజలను రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. వివిధ రకాల పానీయాల తయారీలో కూడా సబ్జా గింజలను ఉపయోగిస్తారు. ఇవి శరీరానికి చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. సబ్జా గింజలు మనకు మార్కెట్ లో విరివిరిగా లభిస్తాయి. మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. చూడడానికి నల్లగా, చిన్నగా ఉండే ఈ సబ్జా గింజలు నీటిలో నానబెట్టగానే తెల్లగా విస్తరించుకుంటాయి. ఈ గింజలలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. మలబద్దకం రాకుండా ఉంటుంది. ఈ గింజలను నీటిలో నానబెట్టి వడకట్టి ఆ నీటిని తాగవచ్చు లేదా నేరుగా ఆ గింజలను కూడా తినవచ్చు. ఇలా చేయడం వల్ల ఎప్పుడూ ఏదో ఒకటి తినే వారు ఆ అలవాటు నుండి బయటపడతారు. అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది.
ఇలా సబ్జా గింజలను నానబెట్టిన నీటిని తాగడం వల్ల శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. వృద్ధాప్య ఛాయలను తగ్గించడంలో కూడా ఈ నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. సబ్జా గింజలను నానబెట్టిన నీటిని తాగడం వల్ల లేదా ఆ గింజలను నానబెట్టుకుని తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. శరీరంలో వేడిని తగ్గించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. చికెన్ పాక్స్ తో బాధపడే వారిలో శరీరంలో వేడి అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ సబ్జా గింజలను నానబెట్టి ఆ నీటిలో కొబ్బరి నీళ్లను కలుపుకుని తాగడం వల్ల వేడి తగ్గుతుంది. ఈ గింజలను నానబెట్టి ఆ నీటిలో నిమ్మరసాన్ని, పంచదారను కలిపి తీసుకోవడం వల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది.
ఈ సబ్జా గింజలను ఇతర పళ్ల రసాల్లో వేసుకుని కూడా తీసుకోవచ్చు. బరువు తగ్గడంలో కూడా ఈ సబ్జా గింజలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. సబ్జా గింజలను నానబెట్టుకుని తినడం వల్ల అధిక బరువు తగ్గుతారని నిపుణులు తెలియజేస్తున్నారు. సబ్జా గింజలు నానబెట్టిన నీటిని రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. షుగర్ వ్యాధిని నియంత్రించడంలో, డీ హైడ్రేషన్ బారిన పడకుండా చేయడంలో ఈ నీరు ఎంతగానో సహాయపడుతుంది.
అంతేకాకుండా సబ్జా గింజలను నానబెట్టిన నీటిని తాగడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు కూడా పెరుగుతుంది. గొంతుమంట, ఆయాసం, ఆస్తమా, దగ్గు, జ్వరం వంటి వాటితో బాధపడుతున్నప్పుడు సబ్జా గింజలను నానబెట్టిన నీటిని తాగినా లేదా ఆ గింజలను తిన్నా మంచి ఫలితం ఉంటుంది. ఈ గింజలను నానబెట్టిన నీటిలో అల్లం రసం, తేనె కలిపి తాగడం వల్ల శ్వాసకోస సంబంధమైన వ్యాధులు తగ్గుతాయి. ఈ విధంగా సబ్జా గింజలను ఉపయోగించి పలు రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.