Coconut : కొబ్బరి చెట్టు.. ఇది మనందరికీ తెలుసు. మన దేశంలో కొబ్బరి చెట్టుకు, కొబ్బరి కాయలకు ఎంతో విశిష్టత ఉంటుంది. కొబ్బరి చెట్టులో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు దాగి ఉంటాయి. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల, అలాగే పచ్చి కొబ్బరిని, ఎండు కొబ్బరిని తినడం వల్ల మనం ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. కొబ్బరిని వంటలలో మాత్రమే ఉపయోగిస్తామని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ కొబ్బరి చెట్టు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుందని మాత్రం చాలా మందికి తెలియదు. కొబ్బరి చెట్టు వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని సంస్కృతంలో నారికేళం, సదాఫలం అని హిందీలో నారియల్ అని పిలుస్తూ ఉంటారు. కొబ్బరి తీపి రుచిని కలిగి ఉంటుందని మనందరికీ తెలుసు. లేత కొబ్బరి పైత్యాన్ని, పైత్య జ్వరాన్ని పోగొట్టడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ముదిరిన కొబ్బరి ఆలస్యంగా జీర్ణమై పైత్యాన్ని పెంచుతుంది.
ముదిరిన కొబ్బరిని తినడం వల్ల శరీరం బలంగా తయారవడమే కాకుండా పురుషులల్లో వీర్యవృద్ధి కూడా కలుగుతుంది. కొబ్బరి నీరు తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. గుండె బలంగా తయారవుతుంది. మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. 50 గ్రాముల కొబ్బరిని మెత్తగా నూరి అందులో ఒక టీ స్పూన్ కండ చక్కెరను, 4 చిటికెల దోరగా వేయించిన పిప్పిళ్ల పొడిని, ఒక టీ స్పూన్ తేనెను కలిపి రెండు పూటలా తీసుకుంటూ ఉండడం వల్ల వాంతులు తగ్గుతాయి. కొబ్బరికాయకు ఉండే ఒక కన్నును పొడిచి అందులో సైంధవ లవణాన్ని వేసి మరలా ఆ కన్నును బంకమట్టితో మూసి ఎండబెట్టాలి. తరువాత దీనిని కాల్చి లోపల ఉండే కొబ్బరిని తీసి దానికి పిప్పిళ్ల పొడిని కలిపి తీసుకుంటూ ఉంటే పరిణామ శూల తగ్గుతుంది.
కొబ్బరి నీళ్లను, పాలను, పటికబెల్లాన్ని సమపాళ్లలో తీసుకుని రోజూ పరగడుపున తాగడం వల్ల లేదా కొబ్బరి పాలను, పటిక బెల్లాన్ని కలుపుకుని తాగడం వల్ల తలనొప్పితోపాటు అనేక శిరో వ్యాధులు తగ్గుతాయి. ఒక గ్లాస్ నీటిలో కొబ్బరి ముక్కలను దంచి వేసి ఒక కప్పు కషాయం అయ్యే వరకు మరిగించి చల్లార్చి అందులో 3 చిటికెల పొంగించిన ఇంగువను కలిపి పరగడుపున తాగుతూ ఉండడం వల్ల కడుపులో పురుగులు నశిస్తాయి. ఒక సంవత్సరం నిల్వ ఉన్న కొబ్బరి నూనెను ప్రతి రోజూ లేపనంగా రాయడం వల్ల వ్రణాలు తగ్గుతాయి. కొబ్బరి నూనెలో సున్నం కలిపి చిలికితే వెన్న లాగా ఉండే నవనీతం వస్తుంది. ఈ నవనీతంలో పచ్చ కర్పూరాన్ని కలిపి కాలిన గాయాలపై రాస్తూ ఉండడం వల్ల గాయాలు తగ్గుతాయి.
కొబ్బరి పూల రసం 30 గ్రాములు, మేక పాలు 50 గ్రాములు, పటిక బెల్లం పొడి 50 గ్రాముల చొప్పున తీసుకుని వీటన్నింటిని కలిపి రోజూ పరగడుపున తాగుతూ ఉంటే సమస్త మూత్ర రోగాలు తగ్గుతాయి. కొబ్బరి పీచును ఇనుప బాండీలో వేసి బూడిద చేయాలి. ఈ బూడిదను 2 గ్రాముల మోతాదులో రెండు పూటలా ఒక టీ స్పూన్ కండచక్కెరతో కలిపి తినడం వల్ల నోటి నుండి రక్తం పడడం ఆగుతుంది. రాతి సున్నాన్ని నీటిలో వేసి పైకి తేలిన సున్నం నీటిని 30 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఈ నీటికి కొబ్బరి నూనెను కలిపి నిల్వ ఉంచుకోవాలి. ఈ నూనెలో శుభ్రమైన వస్త్రాన్ని ఉంచి ఆ వస్త్రాన్ని చర్మ రోగాలు ఉన్న చోట వేయడం వల్ల చర్మ రోగాలు తగ్గుతాయి.
మేక కొమ్మును కానీ, గిట్టను కానీ కాల్చగా వచ్చిన బూడిదకు కొబ్బరి నూనెను కలిపి రాసుకోవడం వల్ల వెంట్రుకలు ఊడిన చోట మరలా కొత్త వెంట్రుకలు వస్తాయి. ఉదయాన్నే పరగడుపున కొబ్బరి నీటిని తాగడం వల్ల శరీరంలో ఉండే వేడి పూర్తిగా తగ్గిపోతుంది. ప్రతి రోజూ కొబ్బరి నీటిని తాగడం వల్ల చర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది. ఈ విధంగా కొబ్బరి నీళ్లను, కొబ్బరిని, కొబ్బరి నూనెను ఉపయోగించి మనం రోగాల బారి నుండి బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.