Sabja Seeds : వేసవికాలం వచ్చిందంటే చాలు మనలో చాలా మంది తరుచూ వేడి చేసిందని చెబుతూ ఉంటారు. వేడి తగ్గడానికి రకరకాల చిట్కాలను పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా సబ్జా గింజలను ఎక్కువగా తాగుతూ ఉంటారు. సబ్జా గింజలను నీటిలో నానబెట్టి వాటిని తింటూ ఈ నీటిని తాగుతూ ఉంటారు. అలాగే ఈ మధ్య కాలంలో సబ్జాగింజలను తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారని చాలా మంది వీటిని బరువు తగ్గడానికి కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే సబ్జాగింజలను వాడడం వల్ల నిజంగా వేడి తగ్గుతుందా.. బరువు తగ్గుతారా… దీని గురించి నిపుణులు ఏమంటున్నారో… ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో వేడి చేయడం వల్ల కళ్ల మంటలు, నోటిలో పొక్కులు, పొట్టలో అసౌకర్యం, మూత్రంలో మంట, తలనొప్పి, మలంలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ లక్షణాలు కనిపించిన వెంటనే చాలా మంది సబ్జా గింజలను నీటిలో నానబెట్టితీసుకుంటూ ఉంటారు. అయితే శరీరంలో వేడి చేయడానికి ముఖ్య కారణం శరీరంలో నీటి శాతం తగ్గడమే అని నిపుణులు చెబుతున్నారు. నీటిని తక్కువగా తాగడం వల్ల వేడి చేసినట్టుగా ఉంటుందని ఈ సమస్య నుండి బయట పడాలంటే నీటిని ఎక్కువగా తాగితే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. వేడి తగ్గడానికి సబ్జా గింజలను, రాగి జావ, మజ్జిగ, నిమ్మరసం వంటి వాటిని తాగడానికి బదులుగా నీటిని ఎక్కువగా తాగితే సరిపోతుందని వారు చెబుతున్నారు.
అంతేకాకుండా సబ్జా గింజలను నేరుగా తినడం వల్ల శరీరంలో వేడి తగ్గదని వీటిని నీటిలో నానబెట్టి తీసుకుంటాం కనుక శరీరానికి నీరు అంది వేడి తగ్గుతుందని ఇది అందరూ గమనించాలని వారు తెలియజేస్తున్నారు. సబ్జా గింజలు కూడా ఒక ఆహార పదార్థామేనని శరీరంలో వేడిని తగ్గించే గుణం ఏ ఆహార పదార్థానికి ఉండదని కేవలం నీటికి మాత్రమే ఉంటుందని వారు చెబుతున్నారు. మన శరీరంలో శక్తి ఉత్పత్తి అయ్యేటప్పుడు వేడి కూడా ఉత్పత్తి అవుతుంది. నీటిని తాగడం వల్ల ఈ వేడి తగ్గుతుంది. అయితే చాలా మంది నీటిని తక్కువగా తాగడం వల్ల కణాలల్లో నీటి శాతం తగ్గి వేడి చేసినట్టుగా ఉంటుంది. నీటిని తాగడం వల్ల కణాలల్లోకి తగినంత నీరు చేరి శరీరం చల్లబడుతుంది.
నీటిని తాగిన 10 నుండి 15 నిమిషాల్లోనే శరీరంలోని కణాల్లోకి నీరు చేరి శరీరం చల్లబడుతుందని వారు చెబుతున్నారు. సబ్జా గింజల నీటిని తాగితే శరీరం చల్లబడుతుందనేది ఒక అపోహ మాత్రమే అని వారు చెబుతున్నారు. అంతేకాకుండా సబ్జా గింజల నీటిని తాగితే శరీరం చల్లబడడానికి సమయం ఇంకా ఎక్కువగా పడుతుందని వారు తెలియజేస్తున్నారు. సబ్జా గింజలు జీర్ణమవ్వడానికి అరగంట నుండి గంట సమయం పడుతుంది. అవి జీర్ణమయ్యే వరకు మన పొట్ట నీటిని అలాగే ఆపి ఉంచుతుంది. కనుక శరీరం చల్లబడడానికి సమయం ఇంకా ఎక్కువగా పడుతుంది. కనుక వేడి చేసినప్పుడు సబ్జా గింజలకు బదులుగా నేరుగా నీటిని తాగితేనే సత్వర ఉపశమనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.