Sleeping On Stomach : మనం నిద్రించేటప్పుడు మనకు నచ్చిన తీరులో నిద్రిస్తూ ఉంటాం. వెల్లకిలా నిద్రించడం, కుడి చేతి వైపు నిద్రించడం, ఎడమ చేతి వైపు నిద్రించడం.. ఈ మూడు పద్దతులనే మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే చాలా తక్కువ మంది బోర్లా పడుకుంటారు. బోర్లా పడుకోవడం వల్ల చాలా మంది ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఛాతి భాగం, పొట్ట భాగం పూర్తిగా పరుపుకు అనేలా పడుకోవడాన్నే బోర్లా పడుకోవడం అని అంటారు. ఇలా నిద్రించడం వల్ల కూడా మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. బోర్లా పడుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి.. అలాగే ఏయే సమస్యలతో బాధపడే వారు బోర్లా పడుకోవడం మంచిది అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గురక సమస్యతో బాధపడే వారు బోర్లా పడుకోవడం వల్ల గురక సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. గురక సమస్యతో బాధపడే వారు వెల్లకిలా పడుకోవడం వల్ల గురక ఎక్కువగా వస్తుంది. వెల్లకిలా పడుకోవడం వల్ల కొండనాలుక వెనుకకి వాలుతుంది. దీంతో అది శ్వాస మార్గానికి కొంత అవరోధాన్ని సృష్టిస్తుంది. దీని వల్ల గురక శబ్దం ఎక్కువగా వస్తుంది. బోర్లా పడుకోవడం వల్ల కొండనాలుక శ్వాస మార్గానికి అవరోధాన్ని కలిగించకుండా ఉంటుంది. దీంతో గురక ఎక్కువగా రాకుండా ఉంటుంది. అయితే పొట్ట ఎక్కువగా ఉన్న వారికి ఇలా బోర్లా పడుకోవడం వల్ల ఒత్తిడి అంతా పొట్ట మీద పడి చాలా అసౌకర్యానికి గురి అవుతారు. ఇలా పొట్ట భాగం ఎక్కువగా ఉన్న వారు ఛాతి కింద దిండు పెట్టుకుని చేతులను పక్కకు చాచి నిద్రించాలి. ఇలా నిద్రించడం వల్ల పొట్ట మీద ఒత్తిడి తగ్గుతుంది.
ఊబకాయంతో బాధపడే వారు వెల్లకిలా పడుకోవడం వల్ల డయాఫ్రామ్ మీద ఎక్కువగా ఒత్తిడి పడి గురక ఎక్కువగా వస్తుంది. ఊబకాయం సమస్యతో బాధపడే వారు ఇలా బోర్లా పడుకోవడం వల్ల డయాఫ్రామ్ మీద ఒత్తిడి తగ్గి గురక తక్కువగా వస్తుంది. అలాగే నడుము నొప్పితో బాధపడే వారు, డిస్క్ సమస్యలతో బాధపడే వారు బోర్లా పడుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ సమస్యలతో బాధపడే వారు పొట్ట భాగంలో దిండును పెట్టుకుని బోర్లా పడుకోవాలి. ఇలా పడుకోవడం వల్ల వెన్ను నొప్పి తగ్గుతుంది. అలాగే బోర్లా పడుకుని ఒక కాలిని చాచి మరో కాలిని మడిచి నిద్రిస్తూ ఉంటారు. వెన్ను నొప్పితో బాధపడే వారు పొట్ట కింద అలాగే మడిచిన కాలి కింద దిండును పెట్టుకోవడం వల్ల మరింత హాయిగా ఉంటుంది.
అలాగే సయాటికా నొప్పులతో బాధపడే వారు కూడా బోర్లా పడుకుని ఒక కాలిని చాచి, మరోకాలిని మడవడంతో పాటు మడిచిన కాలి కింద దిండు పెట్టుకుని నిద్రించడం వల్ల నొప్పుల నుండి చక్కటి ఉపశమనం కలుగుతుంది. అలాగే మెడ నొప్పితో బాధపడే వారు కూడా బోర్లా పడుకోవడం వల్ల కండరాల మీద ఒత్తిడి తగ్గి మెడ నొప్పులు తగ్గుతాయి. అలాగే నిద్రలో చేతులకు తిమ్మిర్లు వచ్చి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు కూడా బోర్లా పడుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఇటువంటి సమస్యలతో బాధపడే వారు బోర్లా పడుకోవడం వల్ల నొప్పుల నుండి చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.