మనకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే.. మనకు అందుబాటులో ఉండే ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడుతాం. అదీ కుదరకపోతే ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలను వాడి మనకు కలిగే సమస్యల నుంచి బయట పడతాం. అయితే ఇవే కాకుండా అనారోగ్య సమస్యలను తగ్గించుకునేందుకు మరొక పద్ధతి కూడా మనకు అందుబాటులో ఉంది. అదే అరోమా థెరపీ.. అంటే పలు పదార్థాలకు చెందిన వాసనలను చూసి మనకు కలిగే అనారోగ్య సమస్యలను నయం చేసుకోవడమన్నమాట. మరి ఏయే సమస్యలు తగ్గాలంటే.. ఏయే పదార్థాలను వాసన చూడాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
లవంగాలను వాసన చూస్తే నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి. చక్కని నిద్ర వస్తుంది. రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు లవంగాలను వాసన చూస్తే బాగా నిద్రపోవచ్చు. దీంతో మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మూడ్ మారుతుంది. పైనాపిల్ పండ్లను వాసన చూస్తే ఒత్తిడి ఇట్టే తగ్గిపోతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. నిమ్మజాతికి చెందిన పండ్లను వాసన చూస్తే మనస్సు రిలాక్స్ అవుతుంది. తాజాదనపు అనుభూతి కలుగుతుంది. ఫ్రెష్‌గా ఉన్నట్లు ఫీలవుతారు. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.
పుదీనా ఆకులను వాసన చూస్తే శక్తి లభిస్తుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. అలాగే నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. మల్లెపువ్వులను వాసన చూస్తే డిప్రెషన్ తగ్గుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిద్రలేమి తగ్గుతుంది. దాల్చినచెక్కను వాసన చూడడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటుంది.