చలికాలం మొదలైందంటే చాలు మనకు సీజనల్ వ్యాధులు పొంచి ఉంటాయి. ఈ సీజన్‌లో మనకు దగ్గు, జలుబు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు ఇబ్బందులు పెడుతుంటాయి. తరచూ శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి అయితే ఈ సీజన్ అంతా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఈ సీజన్‌లో లభించే ఉసిరికాయలను రోజూ తింటే ఎన్నో రకాల వ్యాధుల నుంచి బయట పడవచ్చు. ముఖ్యంగా చలికాలంలో రోజుకు 1 ఉసిరికాయను తింటే 10 ముఖ్యమైన వ్యాధులను నయం చేసుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది.
రోజుకు 1 ఉసిరికాయను తినడం వల్ల అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా చుండ్రు, జుట్టు తెల్లబడడం, జుట్టు పలుచబడడం, జుట్టు బలహీనంగా మారి రాలిపోవడం వంటి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉసిరికాయను రోజూ తింటే అజీర్ణం తగ్గుతుంది. ముఖ్యంగా దీన్ని జ్యూస్ పట్టి 20 ఎంఎల్ మోతాదులో ఒక కప్పు గోరు వెచ్చని నీటిల కలిపి తాగితే అజీర్ణం సమస్య తగ్గుముఖం పడుతుంది. మలబద్దకం, అసిడిటీ సమస్య ఉన్నవారు, కడుపు నొప్పి ఉన్నవారు ఉసిరికాయ జ్యూస్‌లో అలొవెరా జ్యూస్ కలిపి తాగుతుంటే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. తరచూ ఉసిరికాయ జ్యూస్ తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు, మొటిమలు పోతాయి.
రోజూ ఒక ఉసిరికాయను తినడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. కళ్ల సమస్యలు తగ్గుతాయి. హైబీపీ ఉన్నవారు రోజూ ఒక ఉసిరికాయను తింటుంటే బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. ఉసిరికాయను తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. దీంతో అన్ని రకాల చర్మ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి. దంతాలు, చిగుళ్ల సమస్యలను తగ్గించడంలోనూ ఉసిరికాయ ఎంతో మేలు చేస్తుంది. రోజూ 1 ఉసిరికాయను తింటుంటే దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇలా ఉసిరికాయతో ఎన్నో లాభాలను పొందవచ్చు కనుక రోజూ 1 కాయను తినడం మరిచిపోకండి.