Constipation : ప్రస్తుత తరుణంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య మలబద్దకం. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ప్రతి రోజూ మనం తినే ఆహారంలో ఉండే వ్యర్థాలు మలం ప్రేగు ద్వారా బయటకు వెళ్లాలి. కానీ చాలా మందిలో ఇలా జరగదు. ఈ వ్యర్థాలు ప్రేగులల్లో నిల్వ ఉండడం వల్ల ఇతరత్రా సమస్యలకు దారి తీస్తాయి. మలబద్దకం సమస్య ఉన్న వారిలో గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి ఇతర సమస్యలను మనం చూడవచ్చు. ఈ సమస్య ఉన్న వారు ఆహారాన్ని కూడా ఎక్కువగా తీసుకోలేరు. కనుక శరీరంలో పోషకాల లోపం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మలబద్దకం సమస్య రావడానికి ప్రధాన కారణం మనం తినే ఆహారం అనే చెప్పవచ్చు. పీచు పదార్థాలను తక్కువగా తీసుకోవడం, గ్యాస్, అసిడిటీని కలిగించే పదార్థాలను తీసుకోవడం, అధికంగా కొవ్వు కలిగిన పదార్థాలను తీసుకోవడం, నీటిని తక్కువగా తాగడం వంటి వాటిని.. మలబద్దకం సమస్య రావడానికి ప్రధాన కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్య నుండి బయట పడడానికి మనం మార్కెట్ లో దొరికే రకరకాల సిరప్‌లను, మందులను వాడుతూ ఉంటాం. వీటిని వాడే అవసరం లేకుండా మన జీవన విధానంలో, ఆహారపు అలవాట్లలో మార్పులు చేయడం వల్ల ఈ సమస్య నుండి బయట పడవచ్చు.
పీచు పదార్థాలు అధికంగా కలిగి ఉన్న కూరగాయలను, పండ్లను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య తగ్గి సుఖ విరేచనం అవుతుంది. పీచు పదార్థాలు మన ప్రేగులను శుభ్రపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పీచు పదార్థాలను ప్రేగులు సంగ్రహించవు. వీటిని తీసుకోవడం వల్ల ప్రేగులల్లో మలం ఎక్కువగా తయారవుతుంది. ఆహారంలో ఉండే నీటిని పీచు పదార్థాలు పీల్చుకొని మలం గట్టి పడకుండా చేస్తాయి. దీని వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్లిన వెంటనే సుఖ విరేచనం అవుతుంది.
పీచు పదార్థాలు అధికంగా ఉండే సొరకాయ, బీర కాయ, దోస కాయ, కూర అరటి కాయలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఈ కూరగాయలను వాటిపై ఉండే పొట్టును తొలగించకుండా, గింజలతో కలిపి కూర చేసుకొని తినాలి. ఇలా తినడం ద్వారా మాత్రమే సుఖ విరేచనం అవుతుంది. తృణ ధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మల బద్దకం సమస్య తగ్గుతుంది. బత్తాయి పండ్లను, దానిమ్మ గింజలను పిప్పితో సహా తినడం వల్ల సుఖ విరేచనం అవుతుంది. రోజూ ఉదయం లేచిన వెంటనే లీటర్ నీటిని తాగాలి. దీని వల్ల ప్రేగులపై ఒత్తిడి పడి ఎటువంటి ఇబ్బంది లేకుండా విరేచనం అవుతుంది. ఈ ఆహారపు అలవాట్లను పాటించడం వల్ల మలబద్దకం సమస్య తగ్గి సుఖ విరేచనం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.