వయస్సు మీద పడుతుంటే ఎవరికైనా సరే సహజంగానే కంటి సమస్యలు వస్తుంటాయి. కళ్లలో శుక్లాలు ఏర్పడుతుంటాయి. కొందరికి పోషకాహార లోపం వల్ల దృష్టి సమస్యలు వస్తాయి. అయితే రోజువారీ ఆహారంలో పలు మార్పులు చేసుకోవడం వల్ల కంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. శరీరాన్ని కాపాడుకోవడంలో ఆహారం ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందువల్ల రోజూ పలు రకాల పౌష్టికాహారాలను తీసుకోవడం వల్ల కంటి చూపును మెరుగు పరుచుకోవచ్చు. దీంతో పాటు ఇతర కంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
1. బెండకాయల్లో బీటా కెరోటిన్, జియాక్సంతిన్, లుటీన్ ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. వీటిల్లో విటమిన్ సి ఉంటుంది. అందువల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
2. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి. కళ్లలోని రెటీనాను రక్షిస్తాయి. అందువల్ల ఆహారంలో తరచూ చేపలను తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
3. కోడిగుడ్లలో విటమిన్ ఎ, జియాక్సంతిన్, జింక్ వంటి పోషకాలు ఉంటాయి. విటమిన్ ఎ కార్నియాను రక్షిస్తుంది. కంటి ఉపరితలాన్ని కార్నియా అంటారు. ఇది సురక్షితంగా ఉంటుంది. ఇక గుడ్లలో ఉండే లుటీన్, జియాక్సంతిన్‌లు కళ్లలో శుక్లాలు ఏర్పడకుండా చూస్తాయి. రెటీనాను ఆరోగ్యంగా ఉంచుతాయి. జింక్ రాత్రి పూట ఉండే దృష్టి లోపాన్ని తగ్గిస్తుంది. అందువల్ల రోజూ కోడిగుడ్లను తినాలి.
4. బాదం పప్పును తినడం వల్ల కంటి ఆరోగ్యానికి ఎంతగానో మేలు జరుగుతుంది. వీటిల్లో విటమిన్ ఇ ఉంటుంది. ఇది కళ్లలోని కణాలను రక్షిస్తుంది. తరచూ బాదంపప్పును తినడం వల్ల కళ్లలో శుక్లాలు ఏర్పడకుండా ఉంటాయి. అయితే కేవలం బాదంపప్పు మాత్రమే కాకుండా విటమిన్ ఇ ఉండే పొద్దు తిరుగుడు విత్తనాలు, ఇతర నట్స్, వేరుశెనగలను కూడా తినవచ్చు. దీంతో కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది.
5. పాలు, పాల ఉత్పత్తుల్లో విటమిన్ ఎ, జింక్ ఉంటాయి. ఇవి కార్నియా, రెటీనాలను రక్షిస్తాయి. కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. కంటి చూపు సమస్య ఉన్నవారు ఈ ఆహారాలను రోజూ తీసుకుంటే మంచిది.
6. క్యారెట్లలో విటమిన్ ఎ, బీటా కెరోటీన్ ఉంటాయి. ఇవి కంటి ఉపరితలాన్ని రక్షిస్తాయి. కళ్ల ఇన్‌ఫెక్షన్లు, ఇతర కంటి వ్యాధులు రాకుండా చూస్తాయి. క్యారెట్లను రోజూ ఇనడం తినడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. దీన్ని సలాడ్లు, సూప్‌లు, జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.
7. నారింజ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కళ్లలోని రక్త నాళాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. దీంతోపాటు శుక్లాలు ఏర్పడకుండా ఉంటాయి. కంటి చూపు మెరుగు పడుతుంది.
కళ్లు ఆరోగ్యంగా ఉండాలన్నా, కంటి చూపు సురక్షితంగా ఉండాలన్నా ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు చేయించుకోవాలి. కనీసం ఏడాదికి ఒక్కసారి అయినా కళ్లను పరీక్ష చేయించుకోవాలి. సమస్య ఉంటే వైద్యులు సూచించిన విధంగా మందులను వాడాలి. అలాగే పైన తెలిపిన పోషకాహారాలను తీసుకోవాలి. దీంతోపాటు బయటకు వెళ్లినప్పుడు కళ్లకు రక్షణగా సన్ గ్లాసెస్‌ను ధరించాలి. పొగ తాగడం మానేయాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి. దీంతో కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365