బెండకాయలు.. వీటినే ఇంగ్లిష్‌లో లేడీస్ ఫింగర్ అని పిలుస్తారు. ఇవి ఆఫ్రికా, దక్షిణ ఆసియాల్లో ఎక్కువగా పెరుగుతాయి. బెండకాయలు మనకు అందుబాటులో ఉండే సాధారణ కూరగాయల్లో ఒకటి. వీటితో కూరలు, పలు భిన్న రకాల వంటలను చేసుకుంటారు. అయితే బెండకాయలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. బెండకాయల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని పోషకాలకు గనిగా చెప్పవచ్చు. వీటిల్లో ప్రోటీన్లు, ఫైబర్, మెగ్నిషియం, ఫోలేట్, విటమిన్ ఎ, సి, కె, బి6 తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీని వల్ల శరీరానికి పోషణ లభిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బెండకాయల్లో ఉండే విటమిన్ కె గాయాలు అయినప్పుడు రక్తం గడ్డ కట్టేలా చేస్తుంది. బెండకాయలను తినడంవల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.
2. బెండకాయల్లో పాలీఫినాల్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఎలు అధికంగా ఉంటాయి. దీని వల్ల శరీరానికి హాని చేసే ఫ్రీ ర్యాడికల్స్ నాశనం అవుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వాపులు రాకుండా ఉంటాయి. మెదడు పనితీరు మెరుగు పడుతుంది.
3. బెండకాయలను తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె జబ్బులు, స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి.
4. బెండకాయల్లో లెక్టిన్ అనబడే ప్రోటీన్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. క్యాన్సర్లు రాకుండా చూస్తుంది.
5. డయాబెటిస్ సమస్యతో బాధపడేవారికి బెండకాయలు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
6. గర్భిణీలు బెండకాయలను తినడం వల్ల ఎంతగానో మేలు జరుగుతుంది. వీటిల్లో ఉండే విటమిన్ బి9 గర్భిణీలు, శిశువులకు పోషణను అందిస్తుంది. పిండం ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. పిల్లలకు పుట్టుకతో లోపాలు రాకుండా ఉంటాయి.