Vitamin B12 Deficiency : మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ బి12 కూడా ఒకటి. ఎర్ర రక్తకణాల తయారీకి, నరాల పనితీరును మెరుగుపరచడానికి విటమిన్ బి12 ఎంతో అవసరమవుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు విటమిన్ బి 12 చాలా అవసరం. కానీ నేటితరుణంలో మనలో చాలా మంది ఈ విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. చాలా మంది వారికి ఈ విటమిన్ బి 12 లోపం ఉందని కూడా గుర్తించలేకపోతున్నారు. దీంతో వారు నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యల బారిన పడుతున్నారు. విటమిన్ బి 12 లోపించినప్పుడు మన శరీరం కొన్ని సంకేతాలను సూచిస్తుంది. ఈ సంకేతాలను బట్టి మన శరీరంలో విటమిన్ బి12 లోపం ఉందని అర్థం చేసుకోవాలి. విటమిన్ బి12 లోపించడం వల్ల కనిపించే సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మన శక్తి స్థాయిలను అదుపులో ఉంచడంలో విటమిన్ బి12 కీలకపాత్ర పోషిస్తుంది. కనుక ఈ విటమిన్ లోపిస్తే అలసట, నీరసం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. విటమిన్ బి12 లోపించడం వల్ల ఎర్రరక్తకణాల తయారీ తగ్గుతుంది. దీంతో అనీమియా సమస్య తలెత్తుతుంది. చర్మం లేత పసుపు రంగులోకి లేదా పసుపు రంగులోకి మారుతుంది. విటమిన్ బి 12 లోపించడం వల్ల నరాలు దెబ్బతింటాయి. దీంతో కాళ్లల్లో, చేతులల్లో తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. అరి కాళ్లల్లో సూదులు గుచ్చినట్టు ఉంటుంది. విటమిన్ బి 12 లోపించడం వల్ల నాడీ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. దీంతో శరీరంలో సమన్వయం లోపిస్తుంది. ఈ కారణం చేత మనకు నడవడంలో కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. అంతేకాకుండా విటమిన్ బి12 లోపించడం వల్ల అభిజ్ఞాపనితీరు దెబ్బతింటుంది. దీని వల్ల జ్ఞాపకశక్తి సమస్యలు, ఏకాగ్రత లేకపోవడం, మెదడు పనితీరు దెబ్బతినడం వంటి సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక విటమిన్ బి12 లోపించిన వారిలో మానసిక స్థితి సరిగ్గా ఉండదు. నిరాశ, చిరాకు, ఆందోళన వంటివి ఎక్కువగా కనిపిస్తాయి. భావోద్వేగాలకు ఎక్కువగా లోనవుతూ ఉంటారు.
అలాగే విటమిన్ బి 12 లోపించిన వారిలో కండరాల బలహీనత కూడా కనిపిస్తుంది. దీంతో మన పనులను మనం కూడా చేసుకోలేము. ఇక విటమిన్ బి12 లోపించిన వారిలో కనిపించే సంకేతాలలో దృష్టి లోపం కూడా ఒకటి. కళ్లు చీకట్లు కమ్మినట్టుగా ఉండడం, మసకబారడం వంటివి జరుగుతాయి. అంతేకాకుండా విటమిన్ బి12 లోపించిన వారిలో నోటిపూత ఎక్కువగా ఉంటుంది. నాలుక వాపు కూడా కనిపిస్తుంది. అలాగే విటమిన్ బి12 లోపించడం వల్ల స్త్రీలల్లో హార్మోన్ల అసమతుల్యత సమస్య తలెత్తుతుంది. దీంతో నెలసరి సక్రమంగా రాకపోవడం వంటివి జరుగుతాయి. విటమిన్ బి12 లోపించడం వల్ల మన శరీరంలో ఇటువంటి సంకేతాలు కనిపిస్తాయి. ఈ సంకేతాలు కనిపించిన వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.