Vitamin D Powder : మన శరీరారినికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ డి కూడా ఒకటి. విటమిన్ డి మన శరీరంలో అనేక విధులను నిర్వర్తిస్తుంది. మనం తిన్న ఆహారంలో ఉండే క్యాల్షియం, ఫాస్పేట్ వంటి పోషకాలను శరీరం గ్రహించేలా చేయడంలో విటమిన్ డి ఎంతో అవసరం. అలాగే ఎముకలను ధృడంగా ఉంచడంలో, ఒత్తిడి, ఆందోళన వంటి వాటిని దూరం చేయడంలో, రక్తపోటును మరియు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, పలు రకాల క్యాన్సర్ బారిన పడకుండా చేయడంలో, బరువు తగ్గడంలో ఇలా అనేక రకాలుగా విటమిన్ డి మనకు సహాయపడుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలకు కూడా విటమిన్ డి ఎంతో అవసరం. గర్భస్థ శిశువు ఆరోగ్యంగా, చక్కగా ఎదిగేలా చేయడంలో కూడా విటమిన్ డి మనకు సహాయపడుతుంది.
ఇలా అనేక రకాలుగా విటమిన్ డి మనకు దోహదపడుతుంది. కనుక మన శరీరంలో ఎల్లప్పుడూ తగినంత విటమిన్ డి ఉండేలా చూసుకోవాలి. కానీ నేటి తరుణంలో చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. శరీరంలో విటమిన్ డి లోపించడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. విటమిన్ డి లోపించడం వల్ల ఎముకలు గుల్లబారుతాయి. ఎముకలకు సంబంధించిన సమస్యల బారిన పడాల్సి వస్తుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఎక్కువవుతాయి. తరచూ అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఒత్తిడి, ఆందోళన వంటివి ఎక్కువవుతాయి. విటమిన్ డి క్యాప్సుల్స్ ను తీసుకోవడం వల్ల అలాగే విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల మనం మన శరీరంలో విటమిన్ డి లోపం రాకుండా చూసుకోవచ్చు.
అలాగే రోజూ ఎండలో కూర్చోవడం వల్ల కూడా మన శరీరానికి తగినంత విటమిన్ డి లభిస్తుంది. వీటితో పాటు మన ఇంట్లోనే ఒక చక్కటి పొడిని తయారు చేసుకుని వాడడం వల్ల మన శరీరానికి కావల్సినంత విటమిన్ డి లభిస్తుంది. ఈ పొడిని తయారు చేసుకోవడం చాలా సులభం. అలాగే దీనిని వాడడం వల్ల విటమిన్ డి తో పాటు క్యాల్షియం, ప్రోటీన్, ఫైబర్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. ఈ పొడిని ఎవరైనా వాడవచ్చు. మన శరీరానికి తగినంత విటమిన్ డి ని అందించే ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పొడిని తయారు చేసుకోవడానికి ముందుగా కళాయిలో అర కప్పు బాదంపప్పు వేసి దోరగా వేయించాలి. బాదంపప్పు వేగిన తరువాత ఒక టేబుల్ స్పూన్ గసగసాలను వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో ఒక కప్పు ఫూల్ మఖానా వేసి 2 నిమిషాల పాటు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి.
తరువాత అర కప్పు పుట్నాలపప్పును వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత 8 ఎండు ఖర్జూరాలను ముక్కలుగా చేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తరువాత జార్ లోకి తీసుకోవాలి. ఇదే జార్ లో ఒక టేబుల్ స్పూన్ ఎండిన అల్లం పొడి, ఒక టీ స్పూన్ వాము వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసిన పొడిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రోజూ ఒక టేబుల్ స్పూన్ మోతాదులో ఒక కప్పు గోరు వెచ్చని పాలల్లో వేసి కలిపి తీసుకోవాలి. ఈ పాలను రాత్రి పడుకోవడానికి అర గంట ముందు లేదా ఉదయం అల్పాహారానికి ముందు తీసుకోవాలి. ఈ విధంగా పొడిని తయారు చేసి తీసుకోవడం వల్ల విటమిన్ డి లోపం తగ్గడంతో పాటు భవిష్యత్తుల్లో రాకుండా ఉంటుంది.