టెక్నాలజీ మారుతున్న కొద్దీ ప్రపంచంలో అనేక మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు కష్టంగా ఉండే ప్రజల జీవితం నేడు సులభతరం అయింది. ఎన్నో పనులను క్షణాల్లోనే చక్కబెట్టుకుంటున్నాం. కానీ ఒకప్పుడు ఉన్నవి కొన్ని నేడు కనుమరుగైపోయాయి. వాటిల్లో ఈ తినే పదార్థాలు, తినుబండారాలు ఒకటి. వీటిని పిల్లలు ఒకప్పుడు ఎంతో ఇష్టంగా తినేవారు. కాలక్రమేణా ఇవి అంతరించిపోయాయి. ఎక్కడో తప్ప అసలు ఇవి ఇప్పుడు కనిపించడం లేదు. అలాంటి కొన్ని పదార్థాల్లో ఇవి కూడా ఉన్నాయి.
1. తేనె మిఠాయిలు
వీటినే కొన్ని చోట్ల రసగుల్లలు అంటారు. నిజానికి రసగుల్లలు అంటే వేరే. కానీ వీటి మధ్యలో చక్కెర పాకం ఉండేది. అవి ఎంతో తియ్యగా ఉండేవి. అందుకనే వాటిని అలా పిలిచేవారు. ఒకప్పుడు వీటిని చిన్న చిన్న బడ్డీ కొట్లలో గాజు సీసాల్లో పెట్టి అమ్మేవారు. రూపాయి ఇస్తే ఒకటి ఇచ్చేవారు. అయితే ఇవి ఇప్పుడు చాలా చోట్ల కనిపించడం లేదు.
2. సేమియా పుల్ల ఐసులు
పుల్ల ఐస్ అని తోపుడు బండిలో పెట్టుకుని బూర ఊదుతూ ఐస్‌లు అమ్మేవారు. పాల ఐస్, ఆరెంజ్ ఐస్, సేమియా ఐస్, కోకొ కోలా ఐస్.. ఇలా రకరకాల ఐస్‌లు ఉండేవి. సేమియా ఐస్ 2 రూపాయలు. మిగతావన్నీ రూపాయి. ఇప్పుడు వీటినే ఐస్ పాప్స్ అని రూ.150 నుంచి రూ.200 కి ఒక్కటి చొప్పున అమ్ముతున్నారు.
3. సీమచింత కాయలు
సీమ చింత కాయలనే పుల్ల చింతకాయలు అని, పులి చింతకాయలు అని అంటారు. ఇవి పండితే ఎంతో తియ్యగా ఉంటాయి. దోరగా ఉండేవి తియ్యగా, వగరుగా ఉంటాయి. ఇవి ఇప్పుడు ఎక్కడోగానీ కనిపించడం లేదు.
4. బాదం కాయలు
బాదంకాయలను చెట్టుపై ఉన్నప్పుడు రాళ్లతో కొట్టి కింద పడేయడం ఒకెత్తయితే.. వాటిలోని పిక్కను పగలగొట్టి అందులో ఉండే పప్పును తినడం ఒకెత్తు. పిక్కను రాళ్లతో పగలగొట్టేటప్పుడు కొన్ని సార్లు చేతులకు కూడా దెబ్బలు తాకేవి. అయితే బాదం చెట్లు ఇప్పుడు చాలా చోట్ల కనిపించడం లేదు.
5. రేగొడియాలు
ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఎక్కువగా తింటే నోరు కొట్టుకుపోతుంది. ఇవి ఒకప్పుడు బాగానే లభించేవి. కానీ ఇప్పుడు దొరకడం లేదు.
ఇక్కడ ఇచ్చినవి కొన్నే. ఇంకా ఇలాంటి ఎన్నో తినుబండారాలు, ఆహారాలు ఇప్పుడు లేవు. కనుమరుగయ్యాయి.