Fasting : శరీరాన్ని, ఆత్మను ఏకకాలంతో పరిశుద్ధం చేసే విశేషమైన ప్రక్రియే ఉపవాసం. ఉప అనగా భగవంతునికి దగ్గరగా అని, వాసము అనగా నివసించడం అని అర్థం. భగవంతునికి సమీపంగా నివసించడం అని ఉపవాసానికి అర్థం. పరమాత్మ ధ్యాసలో పడి అన్నపానీయాలను మరిచిపోవడమే ఉపవాసం. అంతేకానీ బలవంతంగా అన్నం, నీళ్లకు దూరంగా ఉండడం కాదు. అన్నీ మతాల్లోను ఉపవాసం సంప్రదాయంగా కనిపిస్తుంది. ఏకాదశి రోజున, మహాశివరాత్రి, నవ రాత్రుల రోజుల్లో చేసే ఉపవాసం విశేష ఫలితాన్ని ఇస్తుందని హిందువుల నమ్మకం. ఉపవాసంలో కూడా చాలా పద్దతులు ఉన్నాయి. ఉపవాస విషయంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో పద్దతి కనిపిస్తుంది.
అన్నం, మంచినీళ్లు కూడా తాగకుండా చేసేది సంపూర్ణ ఉపవాసం. ఇది అందరికీ సాధ్యం కాని పని. కాబట్టి పాలు, కొబ్బరి నీళ్లు వంటి ద్రవ పదార్థాలను తీసుకుంటూ పండ్లు, పచ్చి కూరగాయలు, వడపప్పు వంటి వాటిని తీసుకుంటూ కొందరూ ఉపవాసం చేస్తూ ఉంటారు. వీటిలో ఏ పద్దతైనా మనసు పెట్టి ఏకాగ్రతతో చేస్తే చాలు. ఆ ఉపవాసం వల్ల ఉన్న ఉపయోగాలను మనం అందుకోవచ్చు. అసలు ఉపవాసం ఎవరు చేయాలి.. ఎలా చేయాలి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యం బాగున్న వారు రెండు, మూడు రోజులు ఉపవాసం చేయవచ్చు. అయితే ఈ ఉపవాసాన్ని వరుసగా చేయకూడదు. వారంలో రెండు, మూడు రోజులు చేస్తే చాలు. తొలిసారిగా నేరుగా ఒక్కసారే ఉపవాసం ఉంటే ఆరోగ్యం, పుణ్యం సంగతి అటు ఉంచితే అనారోగ్యం అయితే తప్పదు.
ముందుగా తక్కువ భోజనం చేయడం, తరువాత ఒక పూట భోజనం చేయడం, చివరగా అల్పాహారం వంటి వాటితో సరిపెట్టి ఆ తరువాత పూర్తి ఉపవాసం ఉండాలి. ఇలా ఉపవాసం చేయడం వల్ల మనకు కలిగే లాభాలు చాలా ఉన్నాయి. ఉపవాసం వల్ల మనం రోజూ చేసే పనుల్లో సమతుల్యత వస్తుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ మరింత శక్తివంతంగా తయారవుతుంది. అలాగే ఉపవాసం చేయడం వల్ల రక్తపీడనం కూడా త్వరగా తగ్గుతుంది. ఉపవాసం హైబీపీ ఉన్న వారికి మంచిదే అయినా లోబీపీ ఉన్న వారికి మాత్రం సమస్యలను తెస్తుంది. శరీరంలోని మలినాలను తొలగించుకోవడానికి ఉపవాసాన్ని మంచి మార్గంగా చెప్పవచ్చు. ఉపవాసం వల్ల జీర్ణవ్యవస్థకు తగినంత విశ్రాంతి లభించి దాని పనితీరు మెరుగుపడుతుంది. ఓర్పు, క్షమ వంటివి బాగా పెరుగుతాయి.
మనసును అదుపులో ఉంచుకోవడం సాధ్యమవుతుంది. ఏళ్ల పాటు ఉపవాసాన్ని దీక్షగా చేసే వారు నిత్య యవ్వనులుగా కనిపిస్తారు. ఉపవాసాన్ని కూడా నిమ్మరసం, పండ్లరసం వంటివి తీసుకునే విరమించాలి. ఉపవాస విరమణ కాగానే పొట్ట నిండా భోజనం చేయకూడదు. ఉపవాసం తరువాత సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. అంటే చాలా తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. ఉపవాసం విరమించిన వెంటనే మసాలా పదార్థాలను అస్సలు తినకూడదు. ఈ విధంగా చేయడం వల్ల మనం చేసిన ఉపవాసానికి మానసికంగాను, శారీరకంగాను ఫలితం ఉంటుంది. ఆరోగ్యం బాగాలేని వారు లోబీపీ, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయకపోవడమే మంచిది.