ఉరుకుల పరుగుల బిజీ యుగం కారణంగా ప్రస్తుతం చాలామంది రాత్రిపూట ఆహారాన్ని చాలా ఆలస్యంగా తీసుకుంటున్నారు. రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల శరీర మెటబాలిజం దెబ్బతింటుందని వారు అంటున్నారు. అలాగే అధిక బరువు పెరిగిపోయే అవకాశం ఉంటుందని, దీంతో డయాబెటిస్, గుండెపోటు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. కనుక రాత్రిపూట వీలైనంత త్వరగా భోజనం చేయాలని వైద్యులు ఎప్పుడూ చెబుతుంటారు.
అయితే రాత్రిపూట ఏ సమయంలోగా భోజనం చేయాలని చాలామంది సందేహిస్తుంటారు. ఇందుకు డైటిషియన్లు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రిపూట భోజనాన్ని 8 గంటలలోపు ముగిస్తే చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే రాత్రిపూట భోజనానికి, నిద్రకు మధ్య కనీసం 2 నుంచి 3 గంటల వ్యవధి ఉండాలని వారు అంటున్నారు. ఇలా ఉండడం వల్ల మనం తిన్న ఆహారం నిద్రించే లోపే జీర్ణమైపోతుంది. దీంతో మనం పడుకున్న వెంటనే మన శరీరం మరమ్మత్తులు చేసుకుంటుంది. దీనివల్ల రోగాల బారిన పడకుండా ఉంటారు. అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం, అసిటిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
అలాగే శరీరం మెటబాలిజం క్రమబద్ధీకరించబడుతుంది. దీంతో బరువు పెరగకుండా ఉంటారు. అలాగే డయాబెటిస్ బారిన పడకుండా చూసుకోవచ్చు. గుండె సైతం ఆరోగ్యంగా ఉంటుంది. కనుక ఎవరైనా సరే రాత్రిపూట భోజనాన్ని 8 గంటల లోపే ముగించాలని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట భోజనాన్ని 7 గంటలకు తింటే చాలా మంచిదని వారు అంటున్నారు. దీంతో 9 గంటల వరకు నిద్రించవచ్చు. ఉదయం 5 లేదా 6 గంటలకు నిద్ర లేవవచ్చు. ఇలా దినచర్యను పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాదు రోగాలు కూడా రాకుండా ఉంటాయని వారంటున్నారు. కనుక రాత్రి భోజనం విషయంలో ప్రతి ఒక్కరు ఈ నియమాలను పాటించాలని వారు సూచిస్తున్నారు. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చని వారు అంటున్నారు.