White Eggs Vs Brown Eggs : మనకు అందుబాటులో ఉన్న అత్యంత పోషక విలువలు కలిగిన ఆహారాల్లో కోడిగుడ్లు ఒకటి. కోడిగుడ్లను చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌లో తింటుంటారు. ఉడకబెట్టి లేదా ఆమ్లెట్ రూపంలో లేదా ఫ్రై చేసి తింటారు. కోడిగుడ్లను సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతారు. ఎందుకంటే మన శరీరానికి కావల్సిన దాదాపు మొత్తం పోషకాలు గుడ్ల ద్వారా మనకు లభిస్తాయి. కనుక కోడిగుడ్లను ఉత్తమ పౌష్టికాహారంగా చెబుతారు. వీటిని పోషకాలకు గనిగా భావిస్తారు. అనేక రకాల విటమిన్లు, మినరల్స్ గుడ్లలో ఉంటాయి.
కోడిగుడ్లలో అనేక రకాలు ఉంటాయి. అయితే మనకు సాధారణంగా లభించేవి తెలుపు రంగులో ఉండేవి. ఇంకా బ్రౌన్ కలర్‌లో ఉండే కోడిగుడ్లు కూడా లభిస్తాయి. అయితే బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్ లాగే బ్రౌన్ కలర్ కోడిగుడ్లు కూడా ఆరోగ్యకరమైనవని.. తెల్లని కోడిగుడ్ల కన్నా.. బ్రౌన్ కలర్ కోడిగుడ్లే మనకు మంచి లాభాలను అందిస్తాయని చాలా మంది నమ్ముతుంటారు. మరి ఇందులో నిజం ఎంత ఉంది ? దీని గురించి పోషకాహార నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారు ? అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కోడిగుడ్లు బ్రౌన్ కలర్ లేదా వైట్ కలర్.. ఏ కలర్‌లో ఉన్నా వాస్తవానికి వాటిల్లో ఉండే పోషకాలు ఒకే రకంగా ఉంటాయి. కోడిగుడ్లలో ప్రోటీన్లు, జింక్, కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నిషియం, ఫాస్ఫరస్, సెలీనియం, కొలెస్ట్రాల్ వంటివి ఉంటాయి. ఇవి వైట్, బ్రౌన్ కలర్ గుడ్లు.. రెండింటిలోనూ సమానంగానే ఉంటాయి. అందువల్ల ఒకటి ఎక్కువ, మరొకటి తక్కువ అన్న భేదం లేదు. వైట్ లేదా బ్రౌన్.. ఏ కలర్‌కు చెందిన గుడ్లను తిన్నా మనకు ఒకే విధమైన పోషకాలు లభిస్తాయి. కనుక బ్రౌన్ కలర్ గుడ్లను మాత్రమే తినాలన్న రూల్ ఏమీ లేదు. వైట్ కలర్ గుడ్లను తిన్నా అవే పోషకాలు మనకు అందుతాయి.
అయితే మరి బ్రౌన్ కలర్ గుడ్లు ఎందుకలా ఉన్నాయి ? అవి ఆ రంగులోనే ఎందుకు కనిపిస్తాయి ? అంటే.. కోళ్లకు పెట్టే దాణాకు అనుగుణంగా కోడిగుడ్ల కలర్ మారుతుంది. సాధారణంగా నాటు కోళ్లకు భిన్న రకాల ఆహారాలు దాణాగా లభిస్తాయి. కనుక అవి పెట్టే గుడ్లు బ్రౌన్ కలర్‌లో ఉంటాయి. అంతేకానీ.. బ్రౌన్ కలర్ గుడ్లకు ఎలాంటి ప్రత్యేకతా ఉండదు. వైట్ కలర్ గుడ్లలోనూ బ్రౌన్ కలర్ గుడ్లలో ఉండే పోషకాలే ఉంటాయి. రెండింటిలో మనం వేటిని అయినా తినవచ్చు. దీంతో అనేక లాభాలు కలుగుతాయి.