World Kidney Day 2022 : మన శరరీంలో వ్యర్థాలు ఎప్పటికప్పుడు పేరుకుపోతుంటాయన్న సంగతి తెలిసిందే. రోజూ మనం తినే ఆహారాలు, తాగే ద్రవాల కారణంగా మన శరీరంలో వ్యర్థాలు చేరిపోతుంటాయి. అయితే వాటిని శరీరం ఎప్పటికప్పుడు బయటకు పంపుతుంది. ముఖ్యంగా మన శరీరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ ద్రవాలను కిడ్నీలు వడబోస్తాయి. తరువాత ఆ ద్రవాలను బయటకు పంపుతాయి. దీంతో కిడ్నీలు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాయి. కానీ మనం పాటించే జీవన విధానం, ఆహారపు అలవాట్ల వల్ల కిడ్నీలు అనారోగ్యానికి గురవుతుంటాయి. ఈ క్రమంలోనే కిడ్నీలు చెడిపోతే అనేక అనర్థాలు సంభవిస్తాయి. కనుక అలా కాకుండా కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. కింద తెలిపిన ఆహారాలను రోజూ తీసుకోవాలి. దీంతో కిడ్నీల్లోని వ్యర్థాలు సులభంగా బయటకుపోయి అవి ఆరోగ్యంగా ఉంటాయి. మరి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తీసుకోవాల్సిన ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు క్యాబేజీ ఎంతో దోహదపడుతుంది. క్యాబేజీలో విటమిన్లు కె, సి, బి6 అధికంగా ఉంటాయి. అలాగే ఇందులో ఫైబర్, ఫోలిక్ యాసిడ్, ఫైటో కెమికల్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవన్నీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. కనుక క్యాబేజీని తరచూ తీసుకోవడం మంచిది.
2. ధనియాలు కూడా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిని తరచూ తీసుకోవచ్చు. దీంతో శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకుపోతాయి. ధనియాలతో చేసే కషాయాన్ని రోజూ తాగితే ఫలితం ఉంటుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
3. క్రాన్‌బెర్రీలలో ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. కనుక మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. దీంతోపాటు కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కనుక క్రాన్ బెర్రీలను కూడా తరచూ తినాలి.
4. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే ముఖ్యమైన ఆహారాల్లో కాలిఫ్లవర్ ఒకటి. దీన్ని కూడా తరచూ తీసుకోవాలి. ఇందులో పొటాషియం, ఫాస్ఫరస్, విటమిన్లు సి, కె, బి అధికంగా ఉంటాయి. ఇవి కిడ్నీలను సంరక్షిస్తాయి.
5. స్ట్రాబెర్రీలను తరచూ తినడం వల్ల కూడా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కిడ్నీలు చెడిపోకుండా చూస్తాయి. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక స్ట్రాబెర్రీలను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి.