తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే దాన్ని అజీర్ణం అంటారు. అజీర్ణ సమస్య ఎక్కువగా ఉన్నవారిలో, ఆహారం తిన్న తరువాత కొంత సేపటికి జీర్ణాశయంలో గ్యాస్ చేరినా.. త్రేన్పులు బాగా వస్తుంటాయి. కొందరికి త్రేన్పులు వచ్చేటప్పుడు పుల్లగా లేదా కుళ్లిన వాసన అనిపిస్తుంటుంది. అయితే ఈ సమస్య నుంచి బయట పడాలంటే అందుకు కింద తెలిపిన చిట్కాలను పాటించాలి.
1. త్రేన్పుల సమస్య ఉన్నవారు అగ్ని తుండివటి ట్యాబ్లెట్లను వాడుకోవచ్చు. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు 1 లేదా 2 ట్యాబ్లెట్లను (125 – 250 ఎంజీ) తీసుకోవాలి. డాక్టర్ సూచన మేరకు వీటిని వాడుకోవాలి. ఈ ట్యాబ్లెట్లను వాడడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. త్రేన్పులు తగ్గుతాయి.
2. త్రేన్పులు బాగా వస్తున్న వారు భాస్కర లవణం చూర్ణంను కూడా వాడుకోవచ్చు. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు 3 గ్రాముల చొప్పున మజ్జిగతో కలిపి తీసుకోవాలి.
3. ఈ సమస్యకు త్రిఫల చూర్ణం లేదా ట్యాబ్లెట్లు కూడా పనిచేస్తాయి. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు 1-2 ట్యాబ్లెట్లను భోజనానికి ముందు తీసుకోవాలి. లేదా 1-3 గ్రాముల చూర్ణాన్ని తేనె లేదా నెయ్యి లేదా గోరు వెచ్చని నీటితో భోజనానికి ముందు తీసుకోవాలి. దీంతో సమస్య తగ్గుతుంది. అయితే ఆయుర్వేద ఔషధాలను డాక్టర్ల పర్యవేక్షణలో వాడుకోవాల్సి ఉంటుంది.
4. పచ్చి అరటి కాయను ఒకదాన్ని తీసుకుని పూటకు చిన్న ముక్క చొప్పున తింటుంటే త్రేన్పులు తగ్గుతాయి.
5. భోజనం చేసిన తరువాత లవంగాన్ని నోట్లో వేసుకుని నములతూ రసం మింగుతుండాలి. లేదా కొబ్బరినీళ్లను కొద్ది కొద్దిగా తాగుతుండాలి.
6. ఒక టీస్పూన్ వాము, అంతే మోతాదులో మిరియాలను తీసుకుని కలిపి నూరాలి. ఆ మిశ్రమంలో కొద్దిగా తేనె కలిపి రోజుకు 2 సార్లు తీసుకోవాలి. త్రేన్పులు తగ్గుతాయి.
7. నేరేడు గింజల పప్పు, కరక్కాయ బెరడు కలిపి నూరి తేనెతో తీసుకుంటే త్రేన్పులు తగ్గుతాయి.