సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్), ఆయుష్ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఆయుష్-64 ట్యాబ్లెట్లు లక్షణాలు లేని కోవిడ్ బాధితులతోపాటు స్వల్ప లక్షణాలు ఉన్న కోవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ మహేంద్ర ముంజపర వెల్లడించారు. ఈ మేరకు ఆయన లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు ఆ విధంగా సమాధానం ఇచ్చారు.
ఆయుష్ 64 ట్యాబ్లెట్లకు గాను మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కౌన్సిల్, సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)ల ఆధ్వర్యంలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారని తెలిపారు. ఆయుష్ 64 సమర్థతను తేల్చేందుకు ట్రయల్స్ నిర్వహించగా ఆశాజనకంగా ఫలితాలు వచ్చాయన్నారు. అందువల్లే కోవిడ్ స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్న బాధితులతోపాటు లక్షణాలు లేని వారికి చికిత్స కోసం ఆయుష్ 64 ట్యాబ్లెట్లను వాడాల్సిందిగా సిఫారసు చేశామని తెలిపారు.
ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా ఆయుష్ 64 ట్యాబ్లెట్లను విస్తృతంగా పంపిణీ చేస్తున్నామని, అందుకు గాను ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టామని మంత్రి తెలిపారు. అలాగే ఆ ట్యాబ్లెట్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు దేశంలోని 29 ఆయుష్ ఫార్మాసూటికల్ మానుఫాక్చరింగ్ యూనిట్లకు ఆయుష్ 64 టెక్నాలజీని బదిలీ చేశామన్నారు. ఆయుష్ 64 ట్యాబ్లెట్లను కోవిడ్ స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్నవారితోపాటు లక్షణాలు లేని వారికి చికిత్స కోసం ఇవ్వవచ్చని తెలిపారు.
ఆయుష్ 64 ట్యాబ్లెట్లతోపాటు కబసుర్ కుడినిర్ అనే సిద్ధ ఔషధానికి కూడా క్లినికల్ ట్రయల్స్ చేపట్టామని, ఆ ఔషధం కూడా కోవిడ్ ను కట్టడి చేసేందుకు పనిచేస్తుందని ట్రయల్స్‌లో వెల్లడైందని తెలిపారు. అందువల్ల కబసుర్ కుడినిర్ ఔషధానికి కూడా దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు.