Constipation : ప్రస్తుత తరుణంలో మలబద్దకం సమస్య చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. నిత్యం చాలా మంది సుఖ విరేచనం అవక అవస్థలకు గురవుతున్నారు. మలబద్దకం వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. కారం, మసాలాలు అధికంగా ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం, నీళ్లను సరిగ్గా తాగకపోవడం, ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉండడం, ఫైబర్ ఉండే ఆహారాలను తీసుకోకపోవడం, థైరాయిడ్, షుగర్ సమస్యలు, అధికంగా బరువు ఉండడం.. వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి మలబద్దకం వస్తోంది.
అయితే కింద తెలిపిన విధంగా ఓ జ్యూస్‌ను తయారు చేసుకుని రోజూ తాగితే దాంతో మలబద్దకం సమస్యకు చెక్ పెట్టవచ్చు. అలాగే ఇతర జీర్ణ సమస్యలైన గ్యాస్, అసిడిటీ, అజీర్ణం కూడా తగ్గుతాయి. మరి ఆ జ్యూస్ ఏమిటో, ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందామా..!
మలబద్దకాన్ని తగ్గించండలో కొత్తిమీర జ్యూస్ బాగా పనిచేస్తుంది. ఇందులో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల కొత్తిమీర జ్యూస్‌ను రోజూ తాగితే మలబద్దకం నుంచి బయట పడవచ్చు.
కొత్తిమీరను కొద్దిగా తీసుకుని శుభ్రంగ కడిగి కట్ చేయాలి. అనంతరం జ్యూస్ తీయాలి. అర కప్పు జ్యూస్ తీసుకుని అందులో అర కప్పు నీళ్లను కలపాలి. రుచి కోసం కొద్దిగా నిమ్మరసం, తేనె కలపవచ్చు. అనంతరం ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే పరగడుపునే తాగాలి. ఈ విధంగా రోజూ చేయడం వల్ల మలబద్దకం తగ్గుతుంది.
కొత్తిమీర జ్యూస్‌ను ఈ విధంగా తయారు చేసుకుని తాగితే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణక్రియ పెరుగుతుంది. మలబద్దకం, గ్యాస్, కడుపులో మంట సమస్యలు తగ్గుతాయి. శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకునే వారికి కొత్తిమీర జ్యూస్ ఎంతగానో పనిచేస్తుంది.
కొత్తిమీర జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతుంది. తిన్న ఆహారాలు సరిగ్గా జీర్ణమవుతాయి. రక్తం లేని వారికి రక్తం బాగా తయారవుతుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.