Dry Fruits Drink : వర్షాకాలం ముగింపునకు వచ్చి చలికాలం కూడా ప్రారంభం అవుతోంది. కానీ వాతావరణం మాత్రం ఇంకా వేడిగానే ఉంది. పగటిపూట ఎండ వేడి ఎక్కువగా ఉంటోంది. రాత్రి విపరీతమైన చలిగా ఉంటోంది. అయితే పగటి పూట ఉన్న వేడిని చాలా మంది తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే చల్లని పదార్థాలను తీసుకునేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అలాంటి వారు కింద తెలిపిన ఓ డ్రింక్‌ను తయారు చేసి తాగితే చాలు.. శరీరానికి చల్లదనం లభిస్తుంది. వేడి మొత్తం పోతుంది. ఇక ఈ డ్రింక్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చల్లదనాన్నిచ్చే డ్రై ఫ్రూట్స్ డ్రింక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చిక్కని పెరుగు – రెండు కప్పులు, పాలు – రెండు టేబుల్ స్పూన్లు, జీడిపప్పు పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు, బాదం పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు, కిస్మిస్ – మూడు టేబుల్ స్పూన్లు, చిరోంజి – ఒక టేబుల్ స్పూన్, గింజల్లేని ఖర్జూరాలు – మూడు, చక్కెర – రుచికి సరిపడా, ఉప్పు – చిటికెడు, అలంకరణ కోసం డ్రై ఫ్రూట్స్ పలుకులు – పావు కప్పు, తాజా కొబ్బరి తురుము – రెండు టేబుల్ స్పూన్లు, చాక్లెట్ తురుము – ఒక టీస్పూన్.
డ్రై ఫ్రూట్స్ డ్రింక్‌ను తయారు చేసే విధానం..
స్టవ్ మీద బాణలి పెట్టి జీడిపప్పు, చిరోంజి, బాదం పలుకుల్ని దోరగా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు పాలు, కిస్మిస్, వేయించిన బాదం, జీడిపప్పు, చిరోంజి, ఖర్జూరాలు, సరిపడా చక్కెర, ఉప్పు మిక్సీలో వేసి మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. అదేవిధంగా పెరుగును చిక్కని మజ్జిగలా చేసుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని మజ్జిగలో వేసి కలిపి.. గ్లాసుల్లో పోసుకోవాలి. చివరిగా డ్రై ఫ్రూట్స్ పలుకులు, కొబ్బరి తురుము, చాక్లెట్ తురుము కొద్ది కొద్దిగా అలంకరిస్తే చాలు. చల్లని డ్రై ఫ్రూట్స్ డ్రింక్ రెడీ అవుతుంది. దీన్ని మధ్యాహ్నం సమయంలో తాగితే మంచిది. శరీరంలోని వేడి మొత్తం పోతుంది.