చిన్న చిన్న కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు చేయాలంటే ఎవరైనా ఇప్పుడు ఏం వాడుతున్నారు? ఏం వాడుతారు, స్మార్ట్‌ఫోన్లు. అవును, మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్‌ఫోన్లు ఉంటున్నాయి. దీంతో లెక్కల పరంగా ఎలాంటి అవసరం వచ్చినా వెంటనే స్మార్ట్‌ఫోన్‌ను తీయడం, కాలిక్యులేటర్ ఓపెన్ చేయడం, లెక్కలు చేయడం వంటి పనులు ఫాస్ట్‌గా చేస్తున్నారు. అయితే అలా అని చెప్పి సాధారణ కాలిక్యులేటర్లను మరీ పూర్తిగా వాడడం లేదని కాదు. వాటిని వాడే వారు వాటినీ వాడుతున్నారు. కాకపోతే ఎక్కువ మంది మాత్రం స్మార్ట్‌ఫోన్లే వాడుతున్నారు. అంతే. అయితే ఇప్పుడు మ్యాటర్ మాత్రం వేటిని ఎక్కువ వాడుతున్నారని కాదు. ఫోన్ కీ ప్యాడ్, కాలిక్యులేటర్ నంబర్ ప్యాడ్‌ల గురించి. అవును, వాటి గురించే. ఇంతకీ వాటి గురించిన విశేషం ఏముందనేగా మీ డౌట్. ఇంకెందుకాలస్యం, ఆ డౌట్‌ను వెంటనే తీర్చుకుందాం రండి.
ఫోన్ కీ ప్యాడ్ (స్మార్ట్‌ఫోన్‌లో అయితే వర్చువల్ కీ ప్యాడ్ ఉంటుంది), కాలిక్యులేటర్ నంబర్ ప్యాడ్‌లను మీరు ఎప్పుడైనా గమనించారా? అవును, గమనించే ఉంటారు. కానీ వాటి డిజైన్ గురించి అంతగా పట్టించుకుని ఉండరు. అదేనండీ… ఫోన్ కీ ప్యాడ్ అయితే నంబర్లు 1,2,3 అని టాప్‌లో ఉంటాయి. అదే కాలిక్యులేటర్ అయితే దాని ప్యాడ్‌లో నంబర్లు 7,8,9 అని టాప్‌లో ఉంటాయి. అవును, కదా. ఇప్పుడు గుర్తించారా వాటిని. అయితే అవి అలా అపోజిట్ డైరెక్షన్‌లో ఎందుకు డిజైన్ చేయబడ్డాయో మీకు తెలుసా? ఎందుకో చూద్దాం పదండి.
కాలిక్యులేటర్లంటే ఇప్పటి మాట కాదు. ఎప్పుడో జమానా కాలం నుంచి వాటిని వాడుతున్నారు. అయితే అవి రాక ముందు కాలంలో క్యాష్ రిజిస్టర్లు అని పిలవబడే యంత్రాలు ఉండేవి. వాటిని గణనకోసం ఉపయోగించే వారు. కాగా ఆ యంత్రాల్లో పై భాగంలో 9 సంఖ్య ఉంటే కిందకి వచ్చే సరికి 0 ఉంటుంది. ఈ క్రమంలో ఆ డిజైన్‌కు అనుగుణంగానే తదనంతరం కాలిక్యులేటర్లను తయారు చేశారు. అయితే 1960లలో బెల్ ల్యాబ్స్ వారు హ్యూమన్ ఫ్యాక్టర్ ఇంజినీరింగ్ స్టడీస్ ఆఫ్ ది డిజైన్ అండ్ యూజ్ ఆఫ్ పుష్ బటన్ టెలిఫోన్ సెట్స్ అనే అంశంపై పరిశోధనలు చేశారు. ప్రయోగాలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలో వారు నంబర్ ప్యాడ్‌లలో పై భాగంలో 1,2,3 సంఖ్యలు ఉండే డిజైన్‌నే ప్రజలు అధికంగా గుర్తు పెట్టుకుంటారని, దాన్నే సులభంగా వాడవచ్చని గుర్తించారు. దీంతో అప్పటి నుంచి ల్యాండ్‌ఫోన్లే కాదు, వాటి తరువాత వచ్చిన సెల్‌ఫోన్లు, ఇప్పటి స్మార్ట్‌ఫోన్లలోనూ కీ ప్యాడ్‌లో పై వరుసలో 1,2,3 సంఖ్యలు ఉంటాయి. అదీ ఫోన్ కీ ప్యాడ్‌కు, కాలిక్యులేటర్ నంబర్ ప్యాడ్‌కు మధ్య ఉన్న అసలైన విషయం. కానీ ఆ తరువాత నుంచైనా కాలిక్యులేటర్ల డిజైన్‌లలో మాత్రం మార్పులు తేలేదు. ఒకప్పటి పాత పద్ధతి ఏదైతో ఉందో దాన్నే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అందుకే ఫోన్లకు, కాలిక్యులేటర్లకు నంబర్ ప్యాడ్‌లు అపోజిట్ డైరెక్షన్‌లో ఉంటాయి. అంతే!