Almond Milk : మార్కెట్‌లో మనకు బాదం పాలు విరివిగా లభిస్తాయి. వీటిని శీతలీకరించి మనకు విక్రయిస్తుంటారు. బాదం పాలను చల్లగా లేదా వేడిగా.. ఎలా తాగినా ఎంతో రుచికరంగా ఉంటాయి. అయితే వీటిని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలా.. అని చాలా మంది సందేహిస్తుంటారు. కానీ వీటిని ఇంట్లోనూ సులభంగా తయారు చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బాదం పాల పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
బాదం పప్పు – ఒక కప్పు, పిస్తా పప్పు – పావు కప్పు, యాలకులు – 10, పటిక బెల్లం – 150 గ్రా., పసుపు – పావు టీ స్పూన్, కుంకుమ పువ్వు – చిటికెడు.
బాదం పాల పొడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో బాదం పప్పును వేసి మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత పిస్తా పప్పును, యాలకులను కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేటులోకి తీసుకుని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పటిక బెల్లాన్ని తీసుకుని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఒక జార్ లో ముక్కలుగా చేసుకున్న పటిక బెల్లాన్ని, పసుపును, కుంకుమ పువ్వును వేసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిలో వేయించి పెట్టుకున్న బాదం, పిస్తా, యాలకులను వేసి మెత్తని పొడిలా పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బాదం పాల పొడి తయారవుతుంది. ఈ పొడిని మెత్తగా లేదా కొద్దిగా చిన్న పలుకులు మిగిలి ఉండేలా కూడా పట్టుకోవచ్చు. ఇందులో పటిక బెల్లానికి బదులుగా పంచదారను కూడా వాడవచ్చు. రెండు లేదా ఒకటిన్నర కప్పుల పంచదారను పటిక బెల్లానికి బదులుగా వాడుకోవచ్చు. కానీ ఆరోగ్యకరమైన విధంగా తాగాలంటే పటిక బెల్లాన్ని మాత్రమే ఉపయోగించాలి. ఇక ఇలా తయారు చేసుకున్న పొడిని మూత ఉన్న డబ్బాలో గాలి తగలకుండా నిల్వ చేయడం వల్ల రెండు నెలల వరకు పాడవకుండా ఉంటుంది. ఇక కాచిన పాలలో రుచికి తగ్గట్టు ఒకటి లేదా రెండు టీస్పూన్ల బాదం పొడిని వేసి కలుపుకొని తాగడం వల్ల.. రుచిగా ఉండడంతోపాటు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి.