మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకుంటానికి, ఇన్‌ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలు రాకుండా ఉండడానికి ఆయుర్వేదం అనేక రకాల సహజసిద్ధమైన ఔషధాలను సూచిస్తోంది. అందులో మసాలా చాయ్ కూడా ఒకటి. లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, నల్ల మిరియాలు, పసుపు, అనాస పువ్వు, తులసి, తేనె తదితర పదార్థాలతో తయారు చేసుకునే మసాలా టీని వేడి వేడిగా తాగితే శరీర రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. దీంతో వ్యాధులు రాకుండా ఉంటాయి. మరి ఆ మసాలా టీ ఎలా తయారు చేయాలంటే…
తులసి ఆకులను నీడలో ఎండబెట్టాలి. అనంతరం వాటిని లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, నల్ల మిరియాలు, పసుపు, అనాస పువ్వులతో కలిపి.. అన్నింటినీ మిక్సీలో వేసి పొడిలా పట్టుకోవాలి. ఇక సాధారణంగా మనం తయారు చేసే టీలోనే ఆ పొడిని కొద్దిగా కలపాలి. అనంతరం తేనె వేయాలి. దీంతో మసాలా చాయ్ తయారవుతుంది. ఈ క్రమంలో రోజూ ఇలా మసాలా చాయ్ తాగితే శరీర రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది.
అయితే ఆ పదార్థాలతో పొడి తయారు చేసుకుని నిల్వ చేసుకుంటే.. నిత్యం కొద్దిగా పొడిని నేరుగా టీలో వేసుకోవచ్చు. తేనె ఎలాగూ స్టాక్ ఉంటుంది కనుక.. మసాలా చాయ్ చేసుకోవడం తేలికవుతుంది. ఈ టీ వల్ల వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రావని ఆయుర్వేదం చెబుతుంది. కనుక దీన్ని నిత్యం ఒక్కసారి తాగితే ఆరోగ్యంగా ఉండవచ్చు.