ప్రస్తుతం ఎక్కడ చూసినా చలి విజృంభిస్తోంది. చలిగాలుల తీవ్రత ఎక్కువైంది. మరోవైపు సీజనల్ వ్యాధులు వెంటాడుతున్నాయి. దీనికి తోడు కరోనా భయం రోజు రోజుకీ ఎక్కువవుతోంది. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు గాను చాలా మంది నిత్యం అనేక పదార్థాలను తీసుకుంటూ కషాయాలను తాగుతున్నారు. అయితే గుజరాతీయులు ఈ సీజన్‌లో ఎక్కువగా ఉకాడో అనే హెర్బల్ టీని తయారు చేసుకుని సేవిస్తారు. దీంతో శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మరి ఈ హెర్బల్ టీని ఎలా తయారు చేయాలో, అందుకు ఏమేం కావాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
* దాల్చిన చెక్క స్టిక్ – 1
* నల్ల మిరియాలు – 4 లేదా 5
* లవంగాలు – 3 లేదా 4
* పుదీనా ఆకులు – 5 లేదా 6
* తేనె – 1 టీస్పూన్
* పసుపు కొమ్ము – అర అంగుళం
* అల్లం కొమ్ము – అర అంగుళం
* నిమ్మరసం – సగం కాయ
* నీళ్లు – 1 కప్పు
పసుపు, అల్లం కొమ్ములను తురిమి పక్కన పెట్టాలి. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో తురిమిన అల్లం, పసుపు, దాల్చినచెక్క, నల్ల మిరియాలు, లవంగాలు వేసి ఆ నీటిని 4 నుంచి 5 నిమిషాల పాటు మరిగించాలి. అనంతరం స్టవ్ ఆర్పి ఆ నీటిలో క్రష్ చేసిన పుదీనా ఆకులు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. తరువాత పాత్రపై మూత పెట్టి కొంత సేపు వేచి చూడాలి. అనంతరం ఆ నీటిని వడకట్టి అందులో కొద్దిగా తేనె కలుపుకుని తాగాలి.
ఈ హెర్బల్ టీని తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, గొంతు సమస్యలు పోతాయి. అయితే తేనెకు బదులుగా బెల్లం కూడా కలుపుకుని తాగవచ్చు.