తిప్పతీగను ఆయుర్వేదంలో ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. దీన్ని పలు ఆయుర్వేద ఔషధాలను తయారు చేసేందుకు వాడుతారు. తిప్పతీగ వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే తిప్పతీగను ఎలా తీసుకోవాలో చాలా మందికి తెలియదు. దీన్ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తిప్పతీగతో కషాయం చేయదలిస్తే అందుకు తిప్పతీగకు చెందిన 6 ఇంచుల కాండం ఉపయోగిస్తే చాలు. ఇది పెద్దలకు కలిగే వ్యాధులను నయం చేసేందుకు పనికొస్తుంది.
తిప్పతీగకు చెందిన 6 ఇంచుల పొడవైన కాండాన్ని తీసుకోవాలి. దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అనంతరం ఆ ముక్కలను మిక్సీలో వేసి పేస్ట్‌లా పట్టుకోవాలి. తరువాత ఒక పాన్ తీసుకుని అందులో 160 ఎంఎల్ నీటిని పోయాలి. అందులో ముందుగా సిద్ధం చేసుకున్న తిప్పతీగ మిశ్రమాన్ని వేయాలి. తరువాత నీటిని బాగా మరిగించాలి. నీటిలో కేవలం 1/4వ వంతు మాత్రమే మిగిలి ఉండేలా చూసుకోవాలి. అనంతరం ఆ నీటిని సేకరించి ఆ నీరు గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. దీంతో అనేక లాభాలు కలుగుతాయి.
తిప్పతీగతో పైవిధంగా నీటిని తయారు చేసుకుని తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థరైటిస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. శ్వాస సమస్యలు తగ్గుతాయి. జీర్ణ ప్రక్రియ సులభంగా జరుగుతుంది. జ్వరం తగ్గుతుంది. అయితే తిప్పతీగను కషాయంగా తాగలేమని అనుకునే వారు తిప్పతీగ చూర్ణంను అయినా ఉపయోగించవచ్చు. దీంతో కూడా ముందు చెప్పిన ప్రయోజనాలు కలుగుతాయి.