Lassi : ఎండ తీవ్రత కారణంగా మనకు ఏదైనా చల్లగా తాగాలనిపిస్తుంటుంది. అలాంటప్పుడు శరీరానికి చలువ చేసే, నీరసాన్ని తగ్గించే పానీయాలను తాగడం ఎంతో మంచిది. శరీరానికి చలువ చేసే పానీయాలలో లస్సీ కూడా ఒకటి. దీనిని పెరుగుతో తయారు చేస్తారని మనందరికీ తెలుసు. మనం ఇంట్లోనే చాలా సులువుగా మూడు రకాల లస్సీలను తయారు చేసుకోవచ్చు. పావు లీటర్ పెరుగుతో మనం స్వీట్ లస్సీ, మసాలా లస్సీ, చాకొలెట్ లస్సీలను తయారు చేసుకోవచ్చు. ఈ మూడు రకాల లస్సీలను ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
స్వీట్ లస్సీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెరుగు – పావు లీటర్, పంచదార – 4 టేబుల్ స్పూన్స్, చల్లటి నీళ్లు – ముప్పావు గ్లాస్.
స్వీట్ లస్సీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పెరుగును వేసి ఉండలు లేకుండా కవ్వంతో బాగా చిలకాలి. ఇందులో పంచదారను, చల్లని నీళ్లను పోసి కలిపి గ్లాసులో పోసుకోవాలి. దీనిని పిస్తా పలుకులతో గార్నిష్ చేసుకోవాలి. ఇందులో ఐస్ క్యూబ్స్ ను కూడా వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల స్వీట్ లస్సీ తయారవుతుంది. ఇప్పుడు మసాలా లస్సీ ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను తెలుసుకుందాం.
మసాలా లస్సీ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో లేదా రోట్లో 2 మిరియాలను, చిటికెడు దాల్చిన చెక్క పొడిని, నాలుగు పుదీనా ఆకులను, కొద్దిగా కొత్తిమీరను, సగం ముక్క పచ్చి మిర్చిని, చిన్న అల్లం ముక్కను వేసి మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా తయారు చేసిన స్వీట్ లస్సీలో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మసాలా లస్సీ తయారవుతుంది. ఇప్పుడు చాకొలెట్ లస్సీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
చాకొలెట్ లస్సీ తయారీ విధానం..
ముందుగా తయారు చేసుకున్న స్వీట్ లస్సీలో రెండు టీ స్పూన్ల చాకొలెట్ సిరప్ ను, అర టీ స్పూన్ చాకొలెట్ కొకొవా పౌడర్ ను వేసి బాగా కలపాలి. ఇప్పుడు గ్లాస్ ను చాకొలెట్ సిరప్ తో గార్నిష్ చేసి ముందుగా సిద్దం చేసుకున్న లస్సీని పోయాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చాకొలెట్ లస్సీ తయారవుతుంది.
ఈ విధంగా పెరుగుతో చాలా సులువుగా మూడు రకాల లస్సీలను తయారు చేసుకోవచ్చు. రుచికి తగ్గట్టుగా లస్సీలను చేసుకుని తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. ఎండ వల్ల శరీరం కోల్పోయిన శక్తి తిరిగి లభిస్తుంది.