Bellam Annam : మనం తీపి పదార్థాలను తయారు చేయడంలో బెల్లాన్ని వాడుతూ ఉంటాం. తీపి పదార్థాల తయారీలో పంచదారకు బదులుగా బెల్లాన్ని వాడడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. తక్షణ శక్తిని ఇవ్వడంలో, బరువును తగ్గిండంలో, బీపీని నియంత్రించడంలో బెల్లం ఉపయోగపడుతుంది. నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించడంలోనూ బెల్లం ఎంతో సహాయపడుతుంది. బెల్లాన్ని అప్పుడప్పుడూ ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరంలో ఉండే వ్యర్థాలను తొలగించే శక్తి బెల్లానికి ఉంది. అయితే బెల్లంతో మనం అనేక రకాల వంటలు చేస్తుంటాం. వాటిల్లో బెల్లం అన్నం ఒకటి. కొన్ని ప్రాంతాలలో దీనిని బెల్లం పరమాన్నం అని కూడా ఉంటారు. ఎంతో రుచిగా ఉండే ఈ బెల్లం అన్నాన్ని తయారు చేయడం సులభమే. ఇక దీన్ని ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లం అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – రెండు కప్పులు, బెల్లం తరుము – మూడు కప్పలు, నీళ్లు – మూడు గ్లాసులు, నెయ్యి – నాలుగు టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, బాదం పప్పు – 2 టేబుల్ స్పూన్స్, ఎండు ద్రాక్ష – 2 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – అర టీ స్పూన్.
బెల్లం అన్నం తయారీ విధానం..
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లను పోసి నానబెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నె లేదా కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ ను వేసి వేయించి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నె లేదా కళాయిలో బెల్లం తురుము, నీళ్లను వేసి బెల్లం కరిగే వరకు తిప్పుకోవాలి. తరువాత వేయించి పెట్టుకున్న ఢ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఆ తరువాత నాన బెట్టుకున్న బియ్యాన్ని వేసి కలిపి మూత పెట్టి బియ్యం మెత్తని అన్నంలా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఉడికించిన అన్నంపై మరో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం అన్నం తయారవుతుంది. బెల్లం అన్నం తయారీలో ఇతర డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసుకోవచ్చు. తీపి పదార్థాలను తినాలనిపించినప్పుడు చాలా సులువుగా, చాలా తక్కువ సమయంలో ఇలా బెల్లం అన్నాన్ని తయారు చేసుకుని తినవచ్చు. దీంతో తీపి తిన్న భావన కలుగుతుంది. అలాగే బెల్లంలో ఉండే పోషకాలు, ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా లభిస్తాయి.