Dates Laddu : ఖర్జూరాలను తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. తక్షణ శక్తిని అందించడంలో వీటికి ఇవే సాటి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తాయి. రక్తహీనతను తగ్గిస్తాయి. ఇలా ఖర్జూరాలతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వీటితో లడ్డూలను తయారు చేసి కూడా తినవచ్చు. రోజూ ఖర్జూరాలను తినడం ఇబ్బందిగా అనిపించేవారు వీటితో లడ్డూలను తయారు చేసి రోజుకు ఒకటి చొప్పున తిన్నా చాలు. అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇక ఖర్జూరాలతో లడ్డూలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఖర్జూరా లడ్డూలు తయారీకి కావల్సిన పదార్థాలు..
జొన్న పిండి – అర కప్పు, ఖర్జూరాలు -12 (గింజలు తీసి సన్నగా తరగాలి), బాదం పప్పు, వాల్ నట్స్ తురుము – మూడు టేబుల్ స్పూన్లు, నీళ్లు – అర కప్పు, నెయ్యి – రెండు టీస్పూన్లు, అవిసె గింజలు – అర టీస్పూన్.
ఖర్జూరా లడ్డూలను తయారు చేసే విధానం..
జొన్నపిండిని రంగు మారేంత వరకు వేయించి చల్లార్చాలి. గిన్నెలో నీళ్లు పోసి దాంట్లో తురిమిన ఖర్జూరాలు వేసి తక్కువ మంటపై ఉడికించాలి. నీళ్లను పీల్చుకుని ఖర్జూరాలు మెత్తగా అయ్యాక వేయించిన జొన్న పిండి, బాదం, పిస్తా తురుము వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం కాస్త వేడిగా ఉండగానే ఉండలు చుట్టాలి. అర చేతులకు కాస్త నెయ్యి రాసుకుని ఉండలు చుడితే గుండ్రంగా వస్తాయి. ఇలా ఖర్జూరా లడ్డూలను తయారు చేయాలి. అయితే వీటి తయారీలో నూనె, చక్కెర వాడకం లేదు. కనుక ఇవి ఎంతో ఆరోగ్యవంతమైనవి అని చెప్పవచ్చు. ఖర్జూరాలను రోజూ తినలేని వారు ఇలా లడ్డూలను తయారు చేసి రోజుకు ఒకటి తిన్నా చాలు.. అనేక పోషకాలు లభిస్తాయి. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. చిన్నారులు కూడా ఈ లడ్డూలను ఎంతో ఇష్టంగా తింటారు.