Egg Tomato Omelette : కోడిగుడ్లను చాలా మంది రకరకాలుగా తింటుంటారు. ఉడకబెట్టి లేదా ఫ్రై లేదా కూరల రూపంలో తింటారు. ఇక కొందరు ఆమ్లెట్‌లుగా వేసుకుని తింటుంటారు. అయితే ఎప్పుడూ వేసే రొటీన్ ఆమ్లెట్‌కు బదులుగా కోడిగుడ్లతో టమాటా ఆమ్లెట్‌ను వేసుకుని తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పోషకాలను అందిస్తుంది. ఇక కోడిగుడ్డు టమాటా ఆమ్లెట్ ను ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కోడిగుడ్డు టమాటా ఆమ్లెట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
గుడ్లు – రెండు, టమాటాలు – రెండు, ఉల్లిపాయలు – ఒకటి, పచ్చి మిరపకాయలు – నాలుగు, కొత్తిమీర – ఒక కట్ట, పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా.
కోడిగుడ్డు టమాటా ఆమ్లెట్ తయారు చేసే విధానం..
టమాటాలను సన్నగా చక్రాల్లా కోసి పెట్టుకోవాలి. చక్రాల మధ్యలోని గింజల్ని తీసేయాలి. ఒక గిన్నెలో గుడ్డు సొన వేసుకోవాలి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిరపకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. స్టవ్ మీద పెనం పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక ముందుగా సిద్ధం చేసుకున్న కోడిగుడ్ల మిశ్రమంతో ఆమ్లెట్ వేసుకోవాలి. దానిపైన టమాటా ముక్కల్ని వరుసగా పెట్టి కొద్దిగా లోపలికి నొక్కాలి. వీటిపై కొత్తిమీర తురుము కూడా వేయాలి. టమాటా ముక్కలు ఆమ్లెట్‌కి అతుక్కునేదాకా సన్ననిమంటపై వేగనివ్వాలి. రెండవ వైపు కూడా కొద్దిగా వేగనిచ్చి దించేయాలి. దీంతో రుచికరమైన కోడిగుడ్డు టమాటా ఆమ్లెట్ తయారవుతుంది. దీన్ని తింటే రుచి, పోషకాలు రెండూ లభిస్తాయి.