Korrala Annam : మనకు విరివిరిగా లభించే చిరు ధాన్యాలలో కొర్రలు కూడా ఒకటి. కొర్రలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని మనందరికీ తెలుసు. కొర్రలను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. నాడీ మండల వ్యవస్థ పని తీరు మెరుగుపడుతుంది. అజీర్తి సమస్యలను తగ్గించడంలో కొర్రలు ఎంతో సహాయపడతాయి. ఇందులో అధికంగా ఉండే ఫైబర్ మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. తద్వారా అజీర్తి సమస్య తగ్గుతుంది. కొర్రలను తరచూ ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) స్థాయిలు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
రక్తంతో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, బరువు తగ్గడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా కొర్రలు సహాయడతాయి. ప్రస్తుత కాలంలో కొర్రలను వాడే వారు కూడా ఎక్కువవుతున్నారు. కొర్రలతో మనం ఎక్కువగా దోశ, ఇడ్లీ, ఉప్మా వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా కొర్రలతో అన్నాన్ని కూడా వండుకుని తినవచ్చు. రోజూ బియ్యంతో వండిన అన్నాన్ని తినడానికి బదులుగా కొర్రలతో వండిన అన్నాన్ని తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. బియ్యంతో వండిన అన్నంలో కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా, ఇతర పోషకాలు తక్కువగా ఉంటాయి. దీనిని తినడం వల్ల షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బరువు కూడా పెరుగుతారు.
షుగర్ వ్యాధిగ్రస్తులు బియ్యంతో వండిన అన్నాన్ని తినకపోవడమే చాలా మంచిది. దీనిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. బియ్యంతో వండిన అన్నానికి బదులుగా కొర్రలతో వండిన అన్నాన్ని తినం వల్ల చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కొర్రల అన్నాన్ని వండడం కూడా చాలా సులభం. ముందుగా ఒక కప్పు కొర్రలను శభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 6 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఆ నీటిని పారబోసి ఒక కప్పు కొర్రలకు రెండు కప్పుల నీళ్ల చొప్పున పోసి కొర్రలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇందులో ఉప్పును కూడా వేసుకోవచ్చు. ఇలా కొర్రలతో అన్నాన్ని వండుకుని తినడం వల్ల కాలేయ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడి మలబద్దకం కూడా తగ్గుతుంది. షుగర్ వ్యాధి గ్రస్థులు కొర్రలతో వండిన అన్నాన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.