Kunda Biryani : బిర్యానీ అంటే ఎవరికైనా సరే నోట్లో నీళ్లూరతాయి. బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఉండరు.. అంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలోనే భోజన ప్రియుల రుచులకు, ఇష్టాలకు అనుగుణంగా అనేక రకాల బిర్యానీలను వండి వడ్డిస్తున్నారు. అయితే సాధారణంగా మనకు బిర్యానీ ఎక్కడైనా సరే లభిస్తుంది. కానీ కుండ బిర్యానీ కేవలం కొన్ని చోట్లే లభిస్తుంది. దీన్ని తయారు చేసేందుకు కూడా కాస్త శ్రమించాలి. కనుక దీన్ని చాలా తక్కువ మంది విక్రయిస్తారు. అయితే మనం కాస్త శ్రమించాలే కానీ ఇంట్లోనే ఎంతో రుచికరమైన కుండ బిర్యానీని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇక దీన్ని ఎలా వండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కుండ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – కేజీ, పసుపు – అర టేబుల్ స్పూన్, కారం – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర పొడి – పావు టేబుల్ స్పూన్, పచ్చి మిర్చి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – అర టేబుల్ స్పూన్, డీప్ ఫ్రై చేసిన ఉల్లిపాయలు – అర కప్పు, నిమ్మ రసం – రెండు టేబుల్ స్పూన్స్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్ , పెరుగు – 100 గ్రా., నూనె – 6 టేబుల్ స్పూన్స్, ఉప్పు – ఒకటిన్నర టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – అర కప్పు, సాజీరా – ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, యాలకులు – 5, దాల్చిన చెక్క ముక్కలు – 3, మిరియాలు – 10, లవంగాలు – 10, అనాస పువ్వు – ఒకటి, జాజి పువ్వు – ఒకటి.
అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
బాస్మతి బియ్యం – 750 గ్రా., నీళ్లు – 3 లీటర్లు, ఉప్పు – రుచికి తగినంత, సాజీరా – ఒక టీ స్పూన్, లవంగాలు – 5, దాల్చిన చెక్క ముక్కలు – 2, బిర్యానీ ఆకు – ఒకటి, లవంగాలు – 6, యాలకులు – 6, తరిగిన కొత్తిమీర – అర కప్పు, తరిగిన పుదీనా – అర కప్పు.
కుండ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 45 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తరువాత కుండను తీసుకుని అందులో శుభ్రంగా కడిగిన చికెన్ తోపాటు మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి కలిపి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నీళ్లు పోసి నానబెట్టుకున్న బియ్యం తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి కలిపి నీటిని మరిగించుకోవాలి. నీరు మరిగిన తరువాత నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి కలిపి 50 శాతం వరకు బియ్యాన్ని ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి బియ్యంలో ఉన్న నీళ్లన్నింటినీ తొలగించుకోవాలి. ఈ బియ్యాన్ని ముందుగా కుండలో కలిపి పెట్టుకున్న చికెన్ పై వేసి సమానంగా చేసుకోవాలి. ఇలా చేసిన తరువాత బియ్యంపై మరి కొద్దిగా నెయ్యి, తరిగిన కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలను వేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు పెద్ద మంటపై ఉడికించాలి. తరువాత 25 నుండి 30 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కుండ బిర్యానీ తయారవుతుంది. దీనిని నేరుగా లేదా రైతాతో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.