Ganji Annam : మన పూర్వీకులు ఆహారంలో భాగంగా తీసుకున్న వాటిల్లో గంజి అన్నం ఒకటి. ప్రస్తుత తరుణంలో ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణంగా మనలో చాలా మంది గంజి అన్నాన్ని తినడం మానేశారు. గంజి అన్నాన్ని తినడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. వేసవి కాలంలో గంజి అన్నాన్ని తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. ఎముకలు ధృడంగా అవుతాయి.
ఎదిగే పిల్లలకు గంజి అన్నం ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి కాల్సిన పోషకాలన్నీ గంజి అన్నంలో ఉంటాయి. గంజి అన్నం జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి మలబద్దకాన్ని నివారిస్తుంది. గంజి అన్నంలో శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది. ఉదయాన్నే గంజి అన్నాన్ని తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ఇక శరీరానికి ఎంతో మేలు చేసే గంజి అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గంజి అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన బియ్యం – ఒక కప్పు, మజ్జిగ – రెండు కప్పులు, రాళ్ల ఉప్పు – రుచికి సరిపడా, పొడుగ్గా తరిగిన మిరపకాయలు – 2, పెద్దగా, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – 4, నీళ్లు – 4 కప్పులు.
గంజి అన్నం తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యం, నాలుగు కప్పుల నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. అన్నం ఉడికిన తరువాత గంజిని వార్చి పక్కకు పెట్టుకోవాలి. ఉడికిన అన్నాన్ని మట్టి కుండలోకి తీసుకోవాలి. ఈ అన్నం చల్లగా అయిన తరువాత మరో రెండు గ్లాసుల నీళ్లు, పక్కకు పెట్టుకున్న గంజి, మజ్జిగను పోసి, రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న అన్నంపై ఉల్లిపాయ ముక్కలను, పచ్చి మిర్చి ముక్కలను ఉంచి ఒక రాత్రి అంతా పులియబెట్టుకోవాలి. ఇలా పులిసిన అన్నాన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా తీసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చి మిర్చి ముక్కలను తింటూ అన్నాన్ని తింటే ఎంతో రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.