Masala Dal : అన్ని ర‌కాల ప‌ప్పుల‌ను క‌లిపి చేసే మ‌సాలా దాల్‌.. ప్రోటీన్లు, పోష‌కాలు పుష్క‌లం..!

Masala Dal : సాధార‌ణంగా మ‌నం కందిప‌ప్పు, పెస‌ర‌ప‌ప్పు వంటి వాటిని వేర్వేరుగా వండుకుని తింటుంటాం. ఇక మిన‌ప ప‌ప్పును ఇడ్లీలు, దోశ‌లు, గారెల కోసం వాడుతుంటాం. అలాగే మ‌న‌కు ఎర్ర కందిప‌ప్పు కూడా ల‌భిస్తుంది. దీంతోనూ ప‌ప్పు, చారు వంటివి త‌యారు చేస్తూ ఉంటాం. అయితే ఈ ప‌ప్పులు అన్నింటినీ క‌లిపి మ‌సాలా దాల్ త‌యారు చేయ‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని అన్నం లేదా చ‌పాతీల‌తో క‌లిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇక మ‌సాలా దాల్‌ను త‌యారు చేయ‌డం కూడా ఎంతో సుల‌భ‌మే. దీన్ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌సాలా దాల్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పెస‌ర ప‌ప్పు, ఎర్ర కందిప‌ప్పు, మిన‌ప ప‌ప్పు, కంది ప‌ప్పు – అన్నీ క‌లిపి ఒక క‌ప్పు మోతాదులో తీసుకోవాలి, ఉప్పు – త‌గినంత‌, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్‌, ఉల్లిపాయ ముక్క‌లు – పావు క‌ప్పు, ట‌మాటా ముక్క‌లు – అర క‌ప్పు, కొత్తిమీర – ఒక క‌ట్ట‌.

Masala Dal very tasty and nutritious
Masala Dal

మ‌సాలా కోసం కావ‌ల్సిన ప‌దార్థాలు..

వెల్లుల్లి రెబ్బ‌లు – మూడు, ధ‌నియాలు – ఒక టీస్పూన్‌, జీల‌క‌ర్ర – అర టీస్పూన్‌, ప‌సుపు – పావు టీస్పూన్‌, ఎండు మిర్చి – నాలుగు, అల్లం – చిన్న ముక్క‌, ల‌వంగాలు – రెండు, మిరియాలు – అర టీస్పూన్‌.

మ‌సాలా దాల్ త‌యారీ విధానం..

ముందుగా ప‌ప్పుల‌న్నింటినీ క‌డిగి కుక్క‌ర్‌లో వేసి రెండున్న‌ర క‌ప్పుల నీళ్లు పోసి మూడు విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించుకోవాలి. త‌రువాత మ‌సాలా కొసం పెట్టుకున్న ప‌దార్థాల‌న్నింటినీ మిక్సీలో వేసి మెత్త‌గా ప‌ట్టుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ మీద క‌ళాయి పెట్టి నెయ్యి వేయాలి. అది వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత ట‌మాటా ముక్క‌లు వేసి వేయించి కొద్దిగా నీళ్లు పోయాలి. ట‌మాటా ముక్క‌లు ఉడుకుతున్న‌ప్పుడు త‌గినంత ఉప్పు, ముందుగా చేసి పెట్టుకున్న మ‌సాలా వేసి బాగా క‌లిపి ఉడికించుకున్న ప‌ప్పు వేయాలి. 5 నిమిషాలు అయ్యాక కొత్తిమీర చ‌ల్లి దించేయాలి. దీంతో ఎంతో రుచిక‌ర‌మైన మ‌సాలా దాల్ త‌యార‌వుతుంది. ఇది అన్నం లేదా చపాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో భ‌లేగా ఉంటుంది. దీని వ‌ల్ల అన్ని ర‌కాల ప‌ప్పుల్లో ఉండే ప్రోటీన్ల‌ను, ఇత‌ర పోష‌కాల‌ను సులభంగా పొంద‌వ‌చ్చు.

Editor

Recent Posts